పాకిస్తాన్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖైర్‌పూర్ జిల్లాలోని కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయాన్ని ధ్వంసం చేసి కృష్ణుడు ఇతర విగ్రహాలు, మత గ్రంథాలకు నిప్పు పెట్టారు.

ఈ చర్యను నిరసిస్తూ సింధ్ ప్రావిన్స్‌లోని పలు హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై ఖైర్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఈ విషయం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఖురాన్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సింధ్ ప్రావిన్స్ అధికారులను ఆదేశించారు.

పాక్‌ జనాభాలో సుమారు 2 శాతం మంది హిందువులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారు. మైనార్టీలుగా వున్న వీరిపై అతివాదులు వేధింపులకు పాల్పడటం, దేవాలయాలు ధ్వంసం చేయడం ఆనవాయితీగా మారింది.