బీజింగ్: ఓ వైపు కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్  చైనాను కలవరపెడుతోంది. గతంలోని స్వైన్ ఫ్లూ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్ అంటు వ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్ఏఎస్ సోమవారం నాడు ప్రకటించింది. కరోనాతో ఇప్పటికే చైనా ఇబ్బందిపడుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ను తొలుత గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.

also read:24 గంటల్లో 418 మంది మృతి: ఇండియాలో 5,66,840కి చేరిన కరోనా కేసులు

జీ 4 అని పిలిచే జన్యుపరంగా 2009 లో స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్ 1 ఎన్ 1 జాతి నుండి వచ్చిందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ వైరస్ మానవులకు సోకేందుకు అన్ని లక్షణాలు  కలిగి ఉందని చైనా శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ప్రకటించారు.

2011 నుండి 2018 వరకు చైనాలోని 10 రాష్ట్రాల్లో పందుల నుండి 30 వేల శాంపిల్స్ సేకరించి పరిశోధనలు నిర్వహించారు. సుమారు 189 స్వైన్ ఫ్లూ వైరస్ లను ఐసోలేట్ చేసినట్టుగా తెలిపారు. 2016 నుంచి కొత్త రకం వైరస్‌ ఒకటి పందులలో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఇప్పటికే 4.4 శాతం మంది జనాభా ఈ జీ4 బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గుర్తించామన్నారు.