తన సోదరుడు చనిపోయినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో కీలక సూత్రధారి జహ్రాన్ హాషిమ్ సోదరి మధానియా. ఏప్రిల్ 21న జరిగిన వరుస పేలుళ్ల కుట్రలో భాగంగా కొలంబోలోని షాంఘ్రి లా హోటల్‌లో జహ్రాన్ తనని తాను పేల్చేసుకున్నాడు.

అయితే ఈ ఘటనలో చనిపోయింది జహ్రానేనా కాదా..? అన్నది నిర్థారించడానికి ఓ మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారి కాల్మునాయ్ అనే మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న జహ్రాన్ సోదరి మధానియా ఇంటికి వెళ్లారు.

జహ్రాన్ మృతదేహం అంపారా ప్రాంతంలోని ఆసుపత్రిలో ఉంది. మీరు వచ్చి అతను మీ సోదరుడో కాదో చూడాల్సిందిగా కోరాడు. దీనిపై స్పందించిన ఆమె... మీరు కేవలం చనిపోయిన ఉగ్రవాదుల ఫోటోలు మాత్రమే చూపించండి.

తాను వారి మృతదేహాలను చూడాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. తాను 2017లోనే జహ్రాన్‌తో సంబంధాలు తెంచేసుకున్నానని తెలిపింది.

అతను ఆరో తరగతిలోనే చదువు మానేశాడని.. ఇస్లామిక్ చదువులపై దృష్టి సారించిన జహ్రాన్ 2006లో ఇస్లామక్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభించాడని.. అతను ఖురాన్ చదివి మంచి మార్గంలో నడుస్తాడనుకుంటే.. జనాన్ని చంపడం మొదలు పెట్టాడని వాడు చచ్చినందుకు తనకెంతో ఆనందంగా ఉందని మధానియా తెలిపారు.