అమెరికాలో కరోనా: నిమిషానికి ముగ్గురు.. ఒక్కరోజులో దాదాపు 5వేల మరణాలు
గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,591 మంది మృతి చెందడం ఈ మహమ్మారి అగ్రరాజ్యంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. కాగా, యూఎస్‌లో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందు వరసలో ఉంది. అక్కడ కరోనా విలయతాండవం చేస్తోంది. ఊహకు అందకుండా రోజు రోజుకీ మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రతి నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా లక్షా54వేల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ఎక్కువ వాటా అమెరికన్లే ఉండటం శోచనీయం
గత రెండు వారాలుగా యూఎస్‌లో 'కొవిడ్-19' మృత్యు హేల కొనసాగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,591 మంది మృతి చెందడం ఈ మహమ్మారి అగ్రరాజ్యంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. కాగా, యూఎస్‌లో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి.
దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 35వేలు దాటిపోయింది. ఒక్క న్యూయార్క్ లోనే 16వేల మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అమెరికాలో మంగళవారం రాత్రి 8గంటల నుంచి బుధవారం రాత్రి 8గంటల మధ్య కరోనా కారణంగా గంటకు సగటున 107మంది చనిపోయారు. ఆ తర్వాతి 24గంటల్లో వైరస్ మరింత ఉగ్రరూపం దాల్చి 4,591 మందిని బలితీసుకుంది. అంటే గంటకు 191 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా మొత్తంగా అమెరికాలో 7లక్షల మందికిపైగా కరోనా వైరస్ సోకింది.
న్యూయార్క్ నగరం పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. కరోనా కేంద్రంగా మారిన ఈ నగరంలో ఇప్పటివరకు 2,26,198 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 16 వేలకు మందికి పైగా మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ, మసాచుసెట్స్, మిచిగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్, జార్జీయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. యూఎస్ తర్వాత అత్యధికంగా ఇటలీలో 22,170 మంది మృతిచెందారు. కాగా స్పెయిన్‌లో 19,315 మంది 'కొవిడ్-19'కు బలికాగా.. ఫ్రాన్స్‌లో 17,920 మంది, యూకేలో 13,729 మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,184,784 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,46,899 మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది.