కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, టీకా పూర్తిగా అందుబాటులో లేదు. ఇంకా ప్రజలు సమావేశాలు, వేడుకలు, ఉత్సవాలలో కరోనా మార్గదర్శకాలను పూర్తిగా పక్కనబెడుతున్నారు. ఈ వైఖరి కోవిడ్ కేసుల సంఖ్యను పెంచుతోంది. 

కరోనా మహమ్మారి యూరప్‌ను మరోమారు వణికిస్తోంది. వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో యూరప్ దేశాలు పరీక్షలు, రెస్క్యూ ఆసుపత్రులను విస్తరించడంలో మరోమారు బిజీగా మారాయి.

త్వరలోనే బ్రిటన్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశాజనక వార్తలు జోరందుకున్నప్పటికీ, కరోనా మరణాలు తగ్గించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా, జర్మనీలలో శుక్రవారం రికార్డుస్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి.

వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు జర్మనీ సమాయత్తమవుతోంది. సెలవుల నేపథ్యంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రజలను కోరారు.

వైరస్‌ను అడ్డుకునేందుకు మరిన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పారు. తొలి దశలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ కరోనా సెకండ్ వేవ్‌ను మాత్రం జర్మనీ అడ్డుకోలేకపోయింది. దీంతో కరోనా నియంత్రణ కోసం జర్మనీలో మరోసారి కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు మెర్కెల్ ప్రకటించారు.

క్రిస్మస్, నూతన సంవత్సరం కారణంగా, జర్మనీలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు, షాపింగ్ మాల్స్ , డే కేర్ సెంటర్లను డిసెంబర్ 16 నుండి మూసివేస్తున్నట్లు ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. ఈ ఆంక్షలు జనవరి 10 వరకు అమల్లో ఉండనున్నాయి. 

కొత్త మార్గదర్శకాలు:

  • కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయాలి.
  • పాఠశాల పిల్లలకు సెలవు. క్రిస్మస్ సెలవులను జనవరి 10 వరకు పొడిగించారు. తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి.
  • డేకేర్ సెంటర్‌ను మూసివేయాలి. తల్లిదండ్రులు పెయిడ్ లీవ్‌లో పిల్లలను చూసుకోవాలి
  • వీలైనంత వరకు ఇంటి నుండే పనులు కొనసాగించాలి. 
  • చర్చి , మసీదులలో ప్రార్థన కొరకు ప్రత్యేక మార్గదర్శకాలు.