ఉక్రెయిన్ సంక్షోభం క్షణం క్షణం కొత్త మలుపులు తీసుకుంటున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించడానికి సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతిపాదించారు. రష్యా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన ఆంక్షలు అమలు చేస్తామని కమలా హారిస్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ రష్యా అధ్యక్షుడితో ఈ వివాదం విషయమై 105 నిమిషాలు ఫోన్ కాల్‌లో మాట్లాడారు.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం (Ukraine Crisis) ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతందో అనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా(Russia) సైన్యం ఉక్రెయిన్ సరిహద్దు(Border) సమీపంలోనే మోహరించి ఉన్నదని అమెరికా(America) సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, క్రిమియాలోని రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని, చాలా సార్లు షెల్లింగ్‌లతో ఉక్రెయిన్ సైన్యంపై విరుచుకుపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. పశ్చిమ దేశాల అధినేతలతో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రష్యా రెచ్చగొట్టే విధానాలకు, చర్యలకు తాము స్పందించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. అదే సమయంలో అసలు రష్యా అధ్యక్షుడు ఏం కోరుకుంటాన్నారో కూడా తమకు తెలియదని, కాబట్టి, ఆయనతో సమావేశం కావడానికి ప్రతిపాదిస్తున్నట్టు వివరించారు. ఆ చర్చ జరగడానికి లొకేషన్ కూడా పుతిన్ ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, రష్యా ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్‌ను దురాక్రమించే ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఒక వేళ రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే కఠిన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్(French) అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మ్యాక్రన్(Emmanuel Macron).. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలువరించే చివరి ప్రయత్నంగా పేర్కొంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. 105 నిమిషాలు ఆయన పుతిన్‌తో మాట్లాడారు. ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఆయన దౌత్య మార్గాలను ముమ్మరంగా వినియోగిస్తున్నారు. పుతిన్‌తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మ్యాక్రన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమైర్ జెలెన్‌స్కీతో మాట్లాడినట్టు ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఇదిలా ఉండగా, బెలారస్ ప్రభుత్వం ఈ రోజు రష్యా, బెలారస్ బలగాల సంయుక్త డ్రిల్‌ను కొనసాగించబోతున్నట్టు తెలిపింది. ఈ డ్రిల్స్ ఈ వారంతానికల్లా ముగుస్తాయని రష్యా హామీ ఇచ్చింది. అయినప్పటికీ బెలారస్ రక్షణ శాఖ మంత్రి విక్టర్ ఖ్రెనిన్ ఓ ప్రకటనలో పై విధంగా పేర్కొన్నారు. బెలారస్, రష్యా అధ్యక్షులు ఈ డ్రిల్ కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా హాజరయ్యారు. ఉక్రెయిన్ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఓ ప్రతిపాదన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం కావాలనుకుంటున్నారో? వారు ఏం కోరుకుంటున్నారో తమకు తెలియదని అన్నారు. కాబట్టి, ఆ విషయాలు తెలుసుకోవడానికి తాను ఆయనతో ఓ సమావేశాన్ని ప్రతిపాదిస్తున్నానని వెల్లడించారు. ఆ చర్చలకు ప్లేస్‌ను రష్యానే డిసైడ్ చేసినా అభ్యంతరం లేదని వివరించారు. ఈ ఉద్రిక్తతలు చల్లార్చడానికి ఉక్రెయిన్ కేవలం దౌత్య మార్గాన్ని మాత్రమే అవలంభిస్తుందని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం కోసమే తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. అయితే, ఈ ప్రతిపాదనపై రష్యా నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు.

కాగా, ఈ సమావేశంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ భద్రతకు అందరూ పాటుపడాలని అన్నారు. ఒక వేళ ఉక్రెయిన్ ఊబిలో చిక్కుకుంటే.. దాని విపరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తాయని వివరించారు. దాని పరిణామాలు తూర్పు ఆసియా.. తైవాన్‌లోనూ కనిపిస్తాయని తెలిపారు. ప్రజల్లోనూ తప్పుడు అభిప్రాయాలకు తావిస్తాయని చెప్పారు.