అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలోని ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్‌గా ఎన్నుకుంది. 

ఫాక్స్ న్యూస్ ప్రకారం, కెంటకీలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. ఈ ఎన్నికల్లో విల్బర్ బీస్ట్ 13,143 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. "రాబిట్ హాష్‌లో మేయర్ ఎన్నికల్లో మొత్తం 22, 985 ఓట్లు పోలవ్వగా.. విల్బర్ 13,143 ఓట్లతో మేయర్‌గా గెలుపొందింది" అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. 

విల్బర్ బీస్ట్ తరువాత జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే రెండు కుక్కలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్‌ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది.

కెంటకీ.కామ్ ప్రకారం, ఒహియో నది వెంబడి ఉన్న ఇన్‌కార్పొరేటెడ్ కమ్యూనిటీ రాబిట్ హాష్. ఇక్కడ1990 ల నుంచి కుక్కనే దాని మేయర్‌గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. 

విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ.. నమ్మకంతో ఓటు వేసిన అందరికి పూచ్ కృతజ్ఞతలు తెలిపారు’ అన్నారు. 

"కెంటకీలోని నది కుగ్రామ పట్టణమైన రాబిట్ హాష్‌ను సంరక్షించడానికే ఇలా చేస్తున్నామని వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. ఈ పట్టణం సందర్శకులకు కూడా స్వాగతం పలుకుతుంది’ అని అమీ నోలాండ్‌ తెలిపారు.