విమానంలో ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. విమానం కాక్ పిట్ లోకి దూరేందుకు యత్నించాడు. దీంతో.. ఏకంగా.. విమానం మార్గాన్ని మార్చాల్సి వచ్చింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాలిఫోర్నియా నుంచి టెన్నెసీ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్ విమానంలో ఓ ప్ర‌యాణికుడు  ఏకంగా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాంతో విమానాన్ని న్యూ మెక్సికోకు మ‌ళ్లించారు. 

డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737-900 విమానం 162 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బందితో లాస్ ఏంజిల్స్ నుంచి నాష్‌విల్లే బ‌య‌ల్దేరింది. ఈ క్ర‌మంలో విమానంలో ఓ వ్య‌క్తి త‌న వికృత చేష్ట‌ల‌తో తోటి ప్ర‌యాణికుల‌ను ఇబ్బందుల‌కు గురిచేశాడు. విమాన సిబ్బంది స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసిన వినిపించుకోలేదు. 

పైగా త‌న‌కు క‌డుపులో నొప్పిగా ఉంద‌ని, వెంట‌నే ఫ్లైట్‌ను ఆపాలంటూ ప‌దేప‌దే అరిచాడు. అంత‌టితో ఆగ‌కుండా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాంతో చేసేదేమిలేక విమానాన్ని న్యూ మెక్సికోకు మ‌ళ్లించారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ విమానాశ్ర‌యంలో విమానాన్ని ల్యాండ్ చేసి, స‌దరు వ్య‌క్తిని ఎఫ్‌బీఐ అధికారుల‌కు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత విమానం య‌ధావిధిగా మ‌ళ్లీ నాష్‌విల్లేకు బ‌య‌ల్దేరింది.