Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో ఫైరింగ్.. ఒకరు మృతి.. 18 మందికి గాయాలు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పాకిస్తాన్‌లో కొందరు తుపాకులతో ఫైర్ చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ ఫైరింగ్ మరికొందరి ఇంట్లో కొత్త సంవత్సరం రోజే విషాదాన్ని నింపింది. కరాచీలో జరిపిన ఈ ఫైరింగ్‌లో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 18 మంది గాయపడ్డారు. వీరందరినీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 

firing in pakistan new year eve.. one killed
Author
New Delhi, First Published Jan 2, 2022, 8:47 PM IST

కరాచీ: పాకిస్తాన్‌(Pakistan)లో న్యూ ఇయర్ వేడుక(New Year Celebrations)ల్లో అపశృతి చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సంబురాల్లో కొందరు జరిపిన ఫైరింగ్‌(Firing) మరికొందరి ఇంటిలో విషాదాన్ని నింపింది. చెల్లచెదురుగా జరిపిన ఫైరింగ్‌లో ఓ బుల్లెట్ తాకి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 18 మంది తీవ్ర గాయాల పాలైనట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి కరాచీలోని అజ్మేర్ నగ్రికి చెందిన మహమ్మద్ రజా అనే పిల్లాడు ఈ బుల్లెట్‌తో గాయపడ్డాడు. వెంటనే ఆయనను కరాచీలోని జిన్నా హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. కాగా, మరో 18 మంది కూడా ఈ బుల్లెట్ల(Bullet) గాయాలతో హాస్పిటల్‌లో చేరినట్టు అధికారులు వివరించారు. 21 ఏళ్ల మనిషికి ఈ బుల్లెట్‌లతో వీపులో గాయమైంది. ఆయనను ఓ హాస్పిటల్ తీసుకెళ్లగా సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డట్టు అధికారులు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో ఫైరింగ్ జరపవద్దని ముందుగానే పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఫైరింగ్ చేస్తే హత్యా నేరం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్‌లో ఫైరింగ్ చేశారు. గతేడాది కంటే ఈ సారే ఎక్కువ మంది ఈ కాల్పులతో గాయపడ్డారు. గతేడాది కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి కాల్పులతో గాయపడ్డారు. కాగా, ఈ ఘటనను పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. వేడుకల సమయాల్లో ఏరియల్ ఫైరింగ్‌ను సంపూర్ణంగా నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించారు. ‘ర్యాంబో’ తరహా యువకులు అలాంటి పిచ్చి పనులకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బదులు నాగరికులుగా మెదులుకోవాలని ట్వీట్ చేశారు.

Also Read: Taliban: సంబురాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు.. బుల్లెట్లు దిగి 17 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సందర్భంలో కాల్పులు జరిపి 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. సుమారు మరో 40 మంది ఆ బుల్లెట్లతో గాయపడ్డారు. అమెరికన్లు వదిలిన ఆయుధాలు, గత ప్రభుత్వ మిలిటరీకి చెందినవి, సొంతంగా అక్రమంగా కొనుగోలు చేసిన ఆయుధాలు పేలుడు సామగ్రితో తాలిబాన్లు అత్యంత ప్రమాకారులుగా మారారు. వారికిప్పుడు ఆయుధాల కొరత లేదు. ఒకరకంగా చెప్పాలంటే అవసరానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. బాంబులు, బుల్లెట్లు లెక్కచెప్పాల్సిన పనిలేదు. జవాబుదారీతనమూ లేదు. విచ్చలవిడి స్వేచ్ఛ వారి సొంతం. విషాద వార్తలైనా, సంతోషకర విషయమైనా చేతిలోని తుపాకుల ట్రిగ్గర్లు నొక్కడం వారికి పరిపాటిగా మారిపోయింది. తాజాగా కాబూల్‌లో ఓ సంతోషకర వార్త విని పులకించిన తాలిబాన్లు గాల్లోకి కాల్పులు కాల్చి వేడుక చేసుకోవాలని తుపాకుల ట్రిగ్గర్లు నొక్కారు. అది అనుకున్నట్టుగా సాగలేదు. అక్కడే ఉన్న కొందరి దేహాల్లోకి బుల్లెట్లు చీల్చుకెళ్లాయి. కనీసం 17 మంది మరణించారు. అంతేకాదు, కనీసం మరో 40 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios