టీవీ డిబేట్లలో గొడవలు పడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం మామూలైపోయింది. అవి రాజకీయ చర్చలైతే ఈ గొడవలు మరింత ముదురుతాయి. అలాంటి ఘటనే జరిగింది పాకిస్థాన్ లో. లైవ్ లో ఓ ఎంపీ చెంప పగలగొట్టిందో మహిళ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెడితే... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితురాలు, పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ కు స్పెషల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్ టీవీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పీపీపీ(పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) ఎంపీ ఖాదీర్ మండోఖేల్ చెంపను పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసలేం జరిగిందంటే.. ఫిర్దౌస్ ఆశిక్, ఖాదీర్ మండోఖేల్ లు పాకిస్తాన్ లో జరుగుతున్న అవినీతిమీద వాదోపవాదాలు చేసుకున్నారు. ‘దమ్ముంటే మేం చేసిన అవినీతిని రుజువు చేయాలని’  ఫిర్దౌస్, ఖాదీర్ కు సవాల్ విసిరారు. అయితే ఆమె మాటలు పట్టించుకోని ఖాదీర్ ఇది అవినీతి ప్రభుత్వమని పదే పదే ఆరోపణలు చేశారు. 

దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఫిర్దౌస్ కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ ఖాదీర్ చొక్కా పట్టుకుని మేం ఏం తప్పు చేయలేదంటూ అతని చెంప పగలగొట్టారు. ఈ సన్నివేశం అక్కడి కెమరాల్లో రికార్డవడంతో లైవ్ ప్రోగ్రాంను నిలిపివేశారు. 

అయితే విరామ సమయంలో ఫిర్దౌస్ పై ఖాదీర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె తండ్రి గురించి తప్పుగా మాట్లాడారని అక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది పేర్కొన్నారు. అయితే ఈ ఘటన మీద ఫిర్దౌస్ ఇంతవరకు స్పందించలేదు.