పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో పాకిస్తాన్ ఎన్నో కట్టుకథలు చెప్పింది. తమ భూభాగంపై భారత్ దాడులకు పాల్పడలేదని ఒకసారి, ఐఏఎఫ్ బాంబుల వల్ల తమ చెట్లు నాశనమయ్యాయంటూ కబుర్లు చెప్పింది.

తాజాగా దాయాది మరో కొత్త నాటకానికి తెర లేపింది. తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాక్ అటవీశాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా తమ భూభాగంలోని 19 చెట్లను భారత పైలట్లు ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. దీనిపై ఆ దేశ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్ మాట్లాడుతూ... ‘‘పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ అని.. బాలాకోట్‌లో డజన్ల కొద్దీ పైన్ చెట్లు నేలకూలాయి.

మేమెంతో నష్టపోయామని, ఈ విషయంపై చర్యలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత్ పర్యవరణ ఉగ్రవాదానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్ పరువు తీయొచ్చనే ఆలోచనలో పాక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలాకోట్‌లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలని ప్రతిపక్షాలు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు హతమయ్యారో లేక చెట్లు కూలాయో చెప్పాలంటూ భారత్‌లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.