అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో పదుల సంఖ్యలో వైరస్‌ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

అయితే, వీరందరికీ కరోనా ఎలా సోకడానికి కారణం ఏమై ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో దానికి తెరదించారు అంటువ్యాధుల నివారణ నిపుణుడు, కరోనా కట్టడి కోసం ట్రంప్‌ ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు ఆంటోనీ ఫౌచీ .

సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారసురాలిగా ఎమీ కోనీ బారెట్‌ను ప్రకటిస్తూ వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ గత నెల 26న భారీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశమే వైరస్‌ వ్యాప్తికి కారణమైందని ఫౌచీ తెలిపారు.

ఆ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించలేదన్నారు. అందుకే వైరస్‌ చాలా మందికి సోకిందన్నారు. వైట్‌హౌస్‌లో కరోనా బారినపడ్డవారి వివరాలు చూస్తేనే ఇది స్పష్టమవుతోందన్నారు.

వైట్‌హౌస్‌లో తొలుత ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు హోప్‌ హిక్స్‌ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా సోకినట్లు ట్రంప్‌ అక్టోబర్‌ 2న ప్రకటించారు. అంటే ఈ సమావేశం జరిగిన దాదాపు వారం తర్వాత హిక్స్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ఆమె అధ్యక్షుడికి సన్నిహితంగా మెలగడంతో ట్రంప్‌ దంపతులు పరీక్షలు చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో వారికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెకనీ, సలహాదారులు స్టీఫెన్‌ మిల్లర్‌‌, నికోలస్‌ లూనా సహా ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన దాదాపు 12 మంది ఉన్నతాధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు.  

కాగా, కరోనా బారినపడి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. శనివారం వైట్‌హౌస్ ఆవరణలో ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

దీని తర్వాత సోమవారం అధికారికంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యథావిధిగా పాల్గొంటానని ట్రంప్ వెల్లడించారు. దీనిలో భాగంగా సెంట్రల్ ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో అధ్యక్షుడు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.