టెహరాన్: కరోనా వ్యాధిని నాటుసారా అరికడుతోందనే ప్రచారాన్ని నమ్మి 27 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 కరోనా వైరస్ చైనాలో పుట్టింది. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా తర్వాత అతి ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడిన దేశాల్లో ఇరాన్ ఒకటి.

ఈ దేశంలో సుమారు 7 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకినట్టుగా సమాచారం. ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య కూడ పెరుగుతూనే ఉంది.

అయితే కరోనా వ్యాధిని నాటుసారా నయం చేస్తోందని ప్రచారం  సాగింది. ఈ ప్రచారం కారణంగా కొందరు నాటుసారా తాగారు. మోతాదుకు మించి నాటుసారా తాగి రెండు వందల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

నాటుసారా తాగిన వారిలో 27 మంది మృతి చెందారు. మరో 218 మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

ఇరాన్ లో మద్యంపై నిషేధం ఉంది. కానీ, కరోనా నాటుసారా తాగితే నయమయ్యే అవకాశం ఉందని ప్రచారం కారణంగా ఈ వ్యాధి సోకిన వారు తాగి మృత్యువాతపడ్డారు.