క్రికెట్ మ్యాచ్ లో మొదలైన వివాదం.. చివరకు తుపాకీతో కాల్చుకొని.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయేదాకా దారి తీసింది. ఈ సంఘటన పాకిస్థాన్ లోని కైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పక్తుంక్వా ప్రావిన్స్ కి  చెందిన కొందరు చిన్నారులు.. క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. మ్యాచ్ మధ్యలో చిన్నారుల మధ్య చిన్న పాటి వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని కాస్త.. ఆ చిన్నారులు వారి పేరెంట్స్ దాకా తీసుకువెళ్లారు. వారి మధ్య కూడా వివాదం తారా స్థాయికి చేరుకుంది.

దీంతో.. వారు ఇరువర్గాలుగా విడిపోయి.. వివాదం పరిష్కరించమంటూ పోలీస్ స్టేషన్ ని వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు వివాదం గురించి వివరిస్తూ.. మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఓ గ్రూపుకు చెందిన వారు కాల్పులు జరిపారు. మరో గ్రూపువాళ్లుకూడా కాల్పులు ప్రారంభించడంతో పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ గ్రూపులో ముగ్గురు, మరో గ్రూపులో నలుగురు మృతిచెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.