పారిస్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్‌ న్యాయస్థానం సోమవారం అతన్ని దోషిగా తేల్చింది. సర్కోజీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ దేశ నిబంధనల ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీ ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణలు అప్పట్లో సంచలనం రేపాయి.