యుద్ధంపై రష్యా ప్రభుత్వం విదేశాల నుంచే కాదు.. స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తున్నది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై దాడులను వ్యతిరేకిస్తూ రష్యా పౌరులు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మీడియా చానెళ్లపై రష్యా ఆంక్షలు విధించడంతో ఓ టీవీ చానెల్ సిబ్బంది మొత్తం లైవ్ టెలికాస్ట్‌లో మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

న్యూఢిల్లీ: రష్యా(Russia)పై అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఇతర దేశాల నుంచే కాదు స్వదేశంలోనూ రష్యా తీరుపై తీవ్ర అసహనం పెల్లుబుకుతున్నది. ఉక్రెయిన్‌(Ukraine)పై దాడులను ఆపివేయాలని రష్యా ప్రజలు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా ప్రభుత్వం స్వదేశంలోని మీడియాపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం, దురాక్రమణ వంటి పదాలను మీడియా వినియోగించవద్దని స్పష్టం చేసింది. తాము యుద్ధం చేయడం లేదని, కేవలం సైనిక చర్యకు మాత్రమే పరిమితం అవుతున్నట్టు రష్యా పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే రష్యాలోని స్వతంత్ర మీడియా సంస్థలు తీవ్ర వ్యతిరేకతను తెలుపుతున్నాయి.

మీడియాపై రష్యా ప్రభుత్వ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆ దేశంలోని ఓ స్వతంత్ర మీడియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా లైవ్ టెలికాస్ట్ చేస్తూనే అందులోనే ఆ సంస్థ సిబ్బంది మొత్తం రాజీనామాలు చేసింది. ఆ మాస్ రిజిగ్నేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వారు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడి ఆ తర్వాత అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

రష్యాకు చెందిన టీవీ రెయిన్ బ్రాడ్‌క్యాస్టింగ్ చానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చానెల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నటాలీ సిండేయెవా యుద్దం వద్దు అంటూ ఆ లైవ్ టెలికాస్ట్‌లో మాట్లాడారు. ఆ తర్వాత స్టూడియో నుంచి సిబ్బంది మొత్తం వాకౌట్ చేశారు. ఆ తర్వాత చానెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ చానెల్‌ను నిరవధికంగా సేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఈ మాస్ రాజీనామాలకు సంబంధించిన వీడియోను రచయిత డేనియల్ ఆబ్రహం లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. సిబ్బంది మొత్తం రాజీనామాలు చేసిన తర్వాత స్వాన్ లేక్ బ్యాలెట్ వీడియోను ప్లే చేసింది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఈ వీడియోను అధికారిక టీవీ చానెల్ ప్లే చేసింది. 

ఇదిలా ఉండగా, రష్యాలోని చిట్టచివరి స్వతంత్ర రేడియో స్టేషన్ ఎకో మాస్కో కూడా బంద్ అయింది. ఉక్రెయిన్‌పై యుద్ధం సంబంధించిన కవరేజీపై ప్రభుత్వం నుంచి ఈ రేడియో స్టేషన్‌పై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్ల కారణంగానే రేడియో స్టేషన్‌ సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం ఈ రేడియో స్టేషన్ సేవలు నిలిపేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. పలు దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాల్లోని అనుమతించడం లేదు. కొన్ని దేశాలు ఆర్థికంగా కూడా కఠిన ఆంక్షలు విధించాయి. మరోవైపు గత వారం రోజులుగా టెక్ కంపెనీలు గత వారం రోజులుగా టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను బ్లాక్ చేస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాలపై పుతిన్ ఎదురుదాడికి దిగుతున్నారు. రష్యాను ఒంటరి చేయాలనే చూస్తున్న దేశాలపై పుతిన్ ఆంక్షలు విధించాడు. 

తాజా సమాచారం ప్రకారం రష్యా దేశంలోని ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను నిరోధించాలని నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పాటు పలు వార్తా సంస్థలు, సోషల్ మీడియా సైట్‌లను రష్యాలో బ్లాక్‌ చేసినట్టుగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. డెర్ స్పీగెల్ రిపోర్టర్ మాథ్యూ వాన్ రోహ్ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వార్తా సంస్థలు BBC, Deutsche Welle‌తో పాటు యాప్ స్టోర్స్‌ను బ్లాక్ చేసినట్టుగా తెలిపారు.