ఒక వైపు వరదలు, మరోవైపు భారీ భూకంపం.. వెయ్యి ఇళ్లు నేలమట్టం, ఐదుగురి దుర్మరణం
పాపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. ఇందులో ఐదుగురు మరణించారు. కనీసం వంద ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
పాపువా న్యూగినియాలో ప్రజలు ప్రకృతి వైపరీత్యాలతో సతమతం అవుతున్నారు. ఒక వైపు సెపిక్ నది ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మరో వైపు వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారీ భూకంపం సంభవించింది. 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సుమారు వేయి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఐదుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. వారి మృతదేహాలు లభించాయి. ఇక క్షతగాత్రుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని వివరించారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైనట్టు పాపువా న్యూగినియా అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ భూకంప బాధితులకు సహాయం అందించడానికి ఇప్పటికీ రక్షణ సిబ్బంది కార్యక్షేత్రంలోనే ఉన్నారు. భూకంప నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నారు.
సెపిక్ నది ఉప్పొంగడంతో పదుల సంఖ్యలో గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ వరద నీటితోనే అల్లాడిపోతున్న ప్రజలు ఆదివారం ఉదయం భారీ భూకంపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా చోట్ల భూకంపంతో ఇళ్లు ధ్వంసమై.. వరద నీటిలో శిథిలాలు తేలియాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.