ప్రేమికురాలికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఓ ప్రేమికుడు సాహసం చేశాడు. దీంతో ఇద్దరూ కటకటాల పాలయ్యారు. ప్రేయసిని సర్ ఫ్రైజ్ చేద్దామనుకుని అనుకోని చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

లవర్ పుట్టినరోజు అంటే గిఫ్ట్ గా అంటే గులాబీలో, గ్రీటింగ్ కార్డో, చాక్లెట్లో, టెడ్డీబేర్లో.. ఇంకా ఖరీధైన ప్రేమికుడైతే గోల్డ్ రింగో, చెయినో కానుకగా ఇస్తాడు, కానీ ఓ ప్రేమికుడు మాత్రం ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని అరుదైన దాన్ని కానుకగా ఇద్దామనుకున్నాడు. దీనికోసం అప్పుడే పుట్టిన ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి ప్రేయసికి కానుక అందించాడు. 

దుబాయ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అక్కడి మీడియా రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం తమ ఒంటెపిల్ల కనబడడం లేదంటూ ఓ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

అప్పటికే ఒంటెను దొంగతనం చేసిన యువకుడికి ఈ విషయం తెలిసి ఒంట్లో ఒణుకుపుట్టింది. అంతే వెంటనే ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడే.. మూడు కిలోమీటర్ల దూరంలో దాన్ని వదిలిపెట్టి ఏమీ ఎరుగనట్టు వచ్చేశాడు. 

ఆ తరువాత పోలీసులకు ఫోన్‌ చేసి తానే ఆ ఒంటెపిల్లను కనిపెట్టినట్టు చెప్పాడు. అది కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుంటే అనుమానం వచ్చిందంటూ సమాచారం అందించాడు. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.  

ఒంటె జాడ చెప్పిన వ్యక్తే  ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకు దొంగతనం చేశాడని తెలిసింది. దీంతో గట్టిగా విచారిస్తే ఆ వీర ప్రేమికుడు నిజం ఒప్పుకున్నాడు.  మొదట తల్లి ఒంటెనే తీసుకుపోదామనుకున్నానని, కానీ అప్పుడే అక్కడికి యజమానులు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు.

దొంగతనం చేయడమే కాకుండా.. తమను తప్పుదోవ పట్టించినందుకు నిందితుడిని, అతని ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరబ్ దేశాల్లో చాలా కుటుంబాలు పోషణ కోసం ఒంటెల మీద ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. 

పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి వాటిని పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు.