కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కేసులు  కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దుబాయిలో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతోందట. దీంతో.. అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

 కరోనా నేపథ్యంలో దుబాయిలోనూ అనేక నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో దుబాయి మున్సిపాలిటీ అధికారులు కరోనా జాగ్రత్తలపై తనిఖీలు నిర్వహించడం కూడా ప్రారంభించారు. కొవిడ్-19 జాగ్రత్త చర్యలు పాటించని ఓ ఐదు రెస్టారెంట్లను దుబాయి మున్సిపాలిటీ అధికారులు మూసివేశారు. 

దీనికి సంబంధించి ఇటీవల  ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఐదు రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లు అల్ దగాయా ప్రాంతంలోనే ఉన్నాయి. మరో 18 రెస్టారెంట్లకు హెచ్చరికలను కూడా చేశారు. ఇప్పటి వరకు 2,326 తనిఖీలను నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా జాగ్రత్తలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మరోమారు అధికారులు హెచ్చరించారు.