ఇంటర్వ్యూకు వచ్చిన ఓ మహిళను సదరు ఇంటర్వ్యూయర్ వయసు అడిగాడు. తన వయసు కారణంగా ఉద్యోగానికి తీసుకోలేదని ఆ మహిళ భావించింది. దీనిపై న్యాయపోరాటానికి దిగింది. ఫలితంగా ఆ యాజమాన్యం ఆమెకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూలో ఓ మహిళా అభ్యర్థిని వయసు అడగడం చర్చనీయాంశం అయింది. వయసు ఆధారిత పక్షపాతంతో తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆమె భావించింది. ఈక్వాలిటీ కమిషన్‌ను ఆమె ఆశ్రయించింది. దీంతో ఆమె ఇంటర్వ్యూ తీసుకున్న డొమినోస్ స్టోర్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆమెకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించింది. ఇంటర్వ్యూలో వయసు అడగరాదనే విషయంపై తమకు అవగాహన లేదని వివరించింది. ఈ ఘటన ఉత్తర ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.
నార్తర్న్ ఐర్లాండ్‌లో స్ట్రాబేన్ కౌంటీ టైరన్‌లోని డొమినోస్ ఫ్రాంచైజీ స్టోర్ పిజ్జా డెలివరీ డ్రైవర్ జాబ్ కోసం ప్రకటనలు చేసింది. ఈ ప్రకటన చూసి జేనిస్ వాల్ష్ ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆమెకు అప్పటి స్టోర్ ఓనర్ జస్టిన్ క్విర్క్ ప్రశ్నలు వేశారు. ఇంటర్వ్యూలో ఫస్ట్ ప్రస్తావనకు వచ్చింది ఏజ్ అని వాల్ష్ చెప్పారు. ఆమె ఏజ్ కనుక్కున్న తర్వాత ఆమె పిజ్జా డెలివరీ డ్రైవర్ జాబ్ కోసం తన అప్లికేషన్‌ను పరిగణించడం లేదనే విషయాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. ఆ జాబ్‌కు తనను తీసుకోవడం లేదనే విషయం అర్థం అయింది. బహుశా తన వయసు ఆధారంగా ఇంటర్వ్యూ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావించింది.
తాను ఏజ్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నట్టు భావించానని ఆమె తన ఫేస్‌బుక్ మెసేంజర్‌లో స్టోర్‌కు మెసేజీ పంపారు. దీంతో ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అందులో వారు క్షమాపణలు చెప్పారు. ఇంటర్వ్యూలో ఒకరి వయసు గురించి అడగడం సరికాదనే విషయం తమకు తెలియదని పేర్కొన్నారు.
మరో డొమినోస్ ఎంప్లాయీతో మాట్లాడగా డొమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగానికి నియమితి (18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు) వయసు వారినే నియమించుకున్నట్టు ఆమె గమనించింది. తాను మహిళను కాబట్టి డ్రైవింగ్ రోల్ కోసం తనను నిరాకరించారనే విషయం అర్థమైంది.
తన ఇంటర్వ్యూ తర్వాత కూడా డెలివరీ డ్రైవర్ జాబ్ కోసం యాడ్స్ ప్రచురిస్తూనే ఉన్నదని ఆమె తెలిపారు. ఈ లీగల్ పోరాటంలో వాల్ష్‌కు దన్నుగా నార్తర్న్ ఐర్లాండ్ ఈక్వాలిటీ కమిషన్ నిలబడింది. ఈ విషయంలో వాల్ష్‌కు అప్పటి స్టోర్ ఓనర్ క్విర్క్ 4,250 పౌండ్లు (సుమారు రూ. 3.7 లక్షలు) ఇచ్చాడు.
ఈ విషయంపై చర్చ తీవ్రంగా సాగింది. తాము ఫ్రాంచైజీ విధానాన్ని పాటిస్తున్నామని, కాబట్టి, రిక్రూట్‌మెంట్ అనేది ఆ ఫ్రాంచైజీ స్టోర్‌కు చెందిన అంశమని డొమినోస్ స్పందించింది. కాగా, వయసు అడిగి ఉద్యోగానికి తీసుకోని స్టోర్ యాజమాన్యం ఇప్పుడు మారింది. ఆ డొమినోస్ స్టోర్‌ను కొత్త యాజమాన్యం తీసుకుంది. ఈ కొత్త యాజమాన్యం తన సిబ్బందిలో బహుళత, విభిన్నత ఉండాలని కోరుకుంటున్నట్టు వివరించింది.
