కరోనా వైరస్ మహమ్మారికి టీకా కనుగొనే ప్రక్రియ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజల ప్రాణాలను ఏ విధంగా రక్షించాలో అర్ధంకాని పరిస్ధితిలో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వైరస్‌పై అధ్యయనం చేస్తూ, రోజుకొక కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు.

తాజాగా కోవిడ్ 19 బారినపడిన మహిళల కంటే మగవారు చనిపోయే అవకాశం రెండింతలు ఎక్కువట. వృద్ధులు, ఊబకాయం కలిగిన వారితో పాటు భిన్న సంస్కృతిగల మైనారిటీలు కూడా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.

ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులు 1.74 కోట్ల రోగుల రికార్డులను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. అలాగే కరోనా బారినపడిన శ్వేతజాతీయుల కన్నా నల్లజాతీయులు 1.7 రెట్లు, ఆసియన్లు 1.6 రెట్లు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఎన్‌హెచ్ఎస్ అధికారుల విశ్లేషణలో తేలింది.

ఇక ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. సిగరెట్టు తాగేవారి కంటే తాగని వారిలోనే మరణాల సంఖ్య రెట్టింపుగా ఉందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.

పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి కనుక సిగరెట్లు ఎక్కువగా తాగేవారే త్వరగా చనిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తొలుత భావించారు. అయితే సిగరెట్లు తాగే వారందరిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉండకపోవచ్చు.

అయితే వైరస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది గనుక సిగరెట్ పొగ వేడి వల్ల కరోనా మరణించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ధూమపానం మానేసినే వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని.. వైరస్‌ను చంపే గుణం పొగాకులోనే ఉందని , ఆ విషయాన్ని తామె ల్యాబ్ పరీక్షల ద్వారా గుర్తించామని బ్రిటీష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతిస్తే తాము కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బయోలాజికల్ ల్యాబ్‌ను కలిగిన బీఏటీ స్పష్టం చేసింది. అయితే ఎట్టి పరిస్ధితుల్లో ఇలాంటి విషయాల్లో సిగరెట్ కంపెనీల సహాయం తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

ఈ కారణంగానే లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పలు దేశాల్లో బ్రాంచీలు కలిగిన ఏబీటీకి అనుమతించేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరోవైపు ఊపిరితిత్తుల సమస్యలు, గుండెజబ్బులు, మధుమేహం వంటి అనారోగ్యం వున్న వారు, 80 ఏళ్ల పైబడిన వారు కరోనా వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం వుందని ఈ అధ్యయనంలో తేలింది.