అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో బైడెన్  ఘన విజయం సాధించగా.. ట్రంప్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే.. ఎన్నికల ఓడిపోయినప్పటికీ.. ట్రంప్ ఓటమిని అంగీకరించలేదు. ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. చివరకు ఆ కోర్టులోనూ ట్రంప్ కి చుక్కెదురైంది. కాగా.. చివరకు ట్రంప్.. ఈ విషయంలో కాస్త దిగి వచ్చాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు లాంఛనప్రాయమైన ప్రక్రియను ప్రారంభించడానికి డోనల్డ్ ట్రంప్ అంగీకరించారు.

కీలక అధికార యంత్రాంగం 'ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను సవాలు చేయడమూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

జో బైడెన్ 'విజేతగా కనిపిస్తున్నారు' అని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) తెలిపింది.అంతకుముందు, అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో కూడా బైడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ట్రంప్‌కు ఈ ఓటమి తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

అధికార మార్పిడి ప్రక్రియను ప్రారంభించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు బైడెన్ బృందం ప్రకటించింది. "ఈరోజు తీసుకున్న నిర్ణయం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు ఎంతో అవసరం. కరోనా మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం మన ముందున్న సవాళ్లు" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

"ఈ తుది నిర్ణయం అధికార మార్పిడిని ఫెడరల్ ఏజెన్సీల ద్వారా లాంఛనంగా ప్రారంభించడానికి అధికార యంత్రాంగం చేపట్టిన కీలక చర్య" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా.. ఈ విషయంపై ట్రంప్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటమి పాలైనట్టు అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్, జనవరి 20 నాటికి అధికార బదలాయింపునకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. జో బైడెన్ నేతృత్వంలోని ట్రాన్సిషన్ టీమ్ కు ప్రభుత్వ సహకారాన్ని తాను అడ్డుకోబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, "ఏం చేయాలో అది చేయండి" అని సాధారణ పరిపాలనా సేవల విభాగానికి ట్రంప్ చూచించారు.