ఉక్రెయిన్‌పై దాడితో రష్యాపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రష్యా ప్రభుత్వం ఆ దేశంలోని స్వతంత్ర మీడియా సంస్థలపై చర్యలకు సిద్ధం అయింది. దురాక్రమణ, దాడులు, యుద్ధం వంటి పదాలను పేర్కొంటూ అసత్య కథనాలు ప్రచురించవద్దని తెలిపింది. తప్పుడు సమాచారాన్ని ఇచ్చే సంస్థలపై దర్యాప్తు జరుగుతుందని, నిజంగానే ఆ సంస్థలు తప్పు చేసి ఉంటే జరిమానా విధిస్తామని పేర్కొంది. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) అధ్యక్షుడు Vladimir Putin సైనిక చర్య(Military Operation)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉంటాయని వివరించారు. పౌరులు తమ లక్ష్యం కాదని, కేవలం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు స్వతంత్ర ప్రాంతాలు ఎల్‌పీఆర్, డీపీఆర్‌ల ప్రయోజనాలు, రక్షణ కోసం ఈ సైనిక చర్య చేపట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని పలు మిలిటరీ స్థావరాలపై రష్యా బాంబులు, క్షిపణుల దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ప్రకటించారని, ఉక్రెయిన్‌ను దురాక్రమించాలని చూస్తున్నారని పశ్చిమ దేశాలు మండిపడ్డాయి. తాము రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకుంటామని అమెరికా సహా పశ్చిమ దేశాలు వెల్లడించాయి. ఈ దాడులను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. కానీ, రష్యా మాత్రం వాటిని దురాక్రమణ, దాడులు, యుద్ధ ప్రకటనగా పరిగణించడం లేదని తెలుస్తున్నది.

ఈ మేరకు రష్యాలోని స్వతంత్ర మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడానికి రష్యా రెగ్యులేటరీ సన్నద్ధం అయింది. ఎందుకంటే ఆ స్వతంత్ర మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడుతున్నది. టెలివిజన్ చానల్ దోహజ్ద్, రష్యాలోని టాప్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్ నొవాయా గజేటాలూ తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నాయని పేర్కొంది. రష్యా ఆర్మీ.. ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకున్నట్టు, ఉక్రెయిన్ పౌరులను హతమారుస్తున్నట్టు తప్పుడు వార్తలు రాస్తున్నాయని తెలిపింది. 

జనరల్ ప్రాసిక్యూటర్ ఆఫీసు విజ్ఞప్తి మేరకు రష్యా కమ్యూనికేషన్ రెగ్యులేటర్ ఈ రోజు మీడియా తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని లేదంటే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తప్పుడు కథనాలు వెల్లడించిన సంస్థలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. ఒక వేళ అది నిజం అని తేలితే.. ఆ సంస్థకు ఐదు మిలియన్ రూబుల్స్ జరిమానా విధిస్తామని పేర్కొంది. ఒక వేళ ఈ సైనిక చర్య గురించి కథనాలు రాయాలనుకుంటే సరైన సమాచారం అధికారిక రష్యా సమాచార ఔట్‌లెట్‌లలో లభిస్తుందని వివరించింది. 

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు. ‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.

శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. కీవ్ నగరం చుట్టూ సైన్యం పట్టుబిగించే పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆఫర్ చేసింది. తాము తలవంచబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.