ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాల రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థలు డిస్నీ, సోనీ పిక్చర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన.. అవి ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాల రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా బ్రిటన్, అమెరికా తదితర దేశాలు.. రష్యా బ్యాంకులను స్విఫ్ట్ సేవల నుంచి బహిష్కరించాయి. ఐక్య రాజ్యసమితి కూడా రష్యా తీరును తీవ్రంగా ఖండిస్తోంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి.
మెజారిటీ ఐరోపాదేశాలు, కెనడా.. రష్యా విమానాలను తమ గగనతలాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాయి. అంతర్జాతీయ ఐస్ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. ఉక్రెయిన్ యుద్దం ఆపేయాలని ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇక, తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థలు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రష్యాలోని థియేటర్లలో తమ చిత్రాల విడుదలను నిలిపివేస్తున్నట్టుగా డిస్నీ, సోనీ పిక్చర్స్ వేర్వేరుగా ప్రకటించాయి. ‘ఉక్రెయిన్‌పై అనాలోచిత దాడి, విషాదకరమైన మానవతా సంక్షోభం కారణంగా.. మేము రష్యాలో థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకన్నాం. ఇందులో త్వరలోనే పిక్సర్ నుంచి విడుదల కానున్న Turning Red చిత్రం కూడా ఉంది’ అని The Walt Disney ఒక ప్రకటనలో తెలిపింది.
రానున్న రోజుల్లో చోటుచేసుకునే పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తు వ్యాపార నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ సమయంలో శరణార్థులకు తక్షణ సహాయం, ఇతర మానవతా సహాయం అందించడానికి తాము తమ NGO భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని తెలిపింది.
సోనీ పిక్చర్స్ నుంచి ఇదే రకమైన ప్రకటన వెలువడింది. త్వరలో విడుదల కానున్న Morbius చిత్రాన్ని రష్యాలో థియేటరికల్ రిలీజ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సోనీ పిక్చర్స్ తెలిపింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రష్యా సైనిక చర్య, అక్కడ ఏర్పడిన అనిశ్చితి, మనవతా సంక్షోభం.. తమ నిర్ణయానికి కారణమని ప్రకటనలో పేర్కొంది. సైనిక చర్యతో ప్రభావితులైన వారి కోసం తాము ప్రార్థిస్తున్నట్టుగా తెలిపింది. ఈ సంక్షోభం త్వరగా పరిష్కరించబడుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపింది.
ఇప్పటికే అనేక బహుళజాతి కంపెనీలు రష్యా నుంచి తమను తాము దూరం చేసుకున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు మైక్రోసాఫ్ట్ సోమవారం నాడు రష్యా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న వార్తా సంస్థల నుండి సమాచార వ్యాప్తిని పరిమితం చేయడానికి చర్యలు చేపట్టాయి.
