Titan Submersible: తప్పిపోయిన జలాంతర్గామి టైటాన్ మినీ సెర్చ్ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుందనీ, జలాంతర్గామిని వెతుకుతున్న సమయంలో టైటానిక్ ఓడ సమీపంలో శిథిలాలు కనిపించాయని యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.

Titan Submersible: సముద్రగర్భంలో తప్పిపోయిన జలాంతర్గామి టైటాన్ మినీ సెర్చ్ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో మునిపోయిన టైటానిక్ ఓడకు సమీపంలో కొన్నిశిధిలాలు కనుగొనబడ్డాయని యుఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అయితే.. ఆ శకలాలు టైటాన్ జలాంతర్గామేనా? కాదా అనే అంశంపై మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. నివేదిక ప్రకారం.. ఓసిగేట్ కంపెనీకి చెందిన సబ్ మెరైన్ టైటాన్ ఆదివారం (జూన్ 18) సముద్రంలో అదృశ్యమైంది. తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కు 96 గంటలు దాటింది. జలాంతర్గామి లోపల ఆక్సిజన్ కూడా అయిపోయే అవకాశం ఉంది.

 ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో ఐదుగురు ఉన్నారు. పాకిస్థానీ సంతతికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ దావూద్ తోపాటు ఐదుగురు ప్రయాణికులు జలాంతర్గామిలో ఉన్నారు. ఈ సెర్చ్ మిషన్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్ , యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన సిబ్బంది ఉన్నారు.

 తప్పిపోయిన పర్యాటక జలాంతర్గామి కోసం వెతుకుతున్న సమయంలో టైటానిక్ సమీపంలో శిధిలాలను సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు గుర్తించాయని యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం (జూన్ 22) తెలిపింది. దీనిపై ఇప్పుడు నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. కెనడియన్ నౌక హారిజోన్ ఆర్కిటిక్‌కు అనుసంధానించబడిన ROV ద్వారా శిధిలాలను కనుగొన్నారు.

ప్రయాణ సమయం 8 గంటలే 

తప్పిపోయిన జలాంతర్గామి పొడవు 6.7 మీటర్లు, వెడల్పు 2.8 మీటర్లు, ఎత్తు 2.5 మీటర్లు. నివేదిక ప్రకారం.. ఇందులో 5 మందికి 96 గంటల ఆక్సిజన్ ఉంది. ప్రయాణానికి మొత్తం ఎనిమిది గంటల సమయం పడుతుంది. ఇందులో టైటానిక్ ఒక్కటే చూడాలంటే నాలుగు గంటలు పడుతుంది.