ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ప్రక్షాళనలో భాగంగా అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్వతారోహణలో భాగంగా ఇక్కడ సుమారు 300 మంచులో కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను వెలికి తీశారు. వివిధ బేస్ క్యాంపుల్లో ఉన్న సుమారు 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది.

ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు, మానవ వ్యర్ధాలు, ఆక్సిజన్ బాటిళ్లు, టెంట్లు, తాళ్లు, విరిగిపోయిన నిచ్చెనలు, ఇతర వ్యర్థాలను తొలగించారు. వేసవిలో మంచు కరగడంతో కొన్ని బయటకు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఎవరెస్ట్ పర్వతారోహణలో భాగంగా నమోదవుతున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు నేపాల్ చర్యలు ప్రారంభించింది. ఎవరెస్ట్ శిఖరంపై పర్వతారోహకుల మరణాలు, ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో పర్వత అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ ఆలోచిస్తుంది.

అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది. టిబెట్ ప్రభుత్వం కేవలం 300 మందికి మాత్రమే ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుండగా.. నేపాల్ మాత్రం మాత్రం అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది.