కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి ఈ వైరస్ సోకింది.  ప్రపంచ వ్యాప్తంగా పదిలక్షల మందికి పైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ వైరస్ కి మందు కనుగొనేందుకు పరిశోధకులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ వైరస్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఒకసారి కరోనా బారిపడినవారు మరోమారు ఈ వ్యాధి బారిన పడితే అది వారికి మరింత ప్రమాదకరంగా మారవచ్చని గుర్తించారు. ఈ పరిశోధనల వివరాలను ది లెన్సెంట్ మ్యాగజైన్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే పేరుతో ప్రచురించారు. దీనిలో అమెరికాకు చెందిన ఒక బాధితునికి మరోమారు కరోనా వైరస్ సోకినపుడు ఎదురైన సమస్యలకు సంబంధించిన వివరాలను అందించారు. 

25 ఏళ్ల  ఆ యువకుడు కరోనా నుంచి కోలుకున్న 48 రోజుల తరువాత మరోమారు అతనిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. రెండోసారి అతనికి సోకిన కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో వైద్యులు బాదితునికి ఆక్సిజన్ సపోర్టు అందించి చికిత్స చేయల్సివచ్చింది. శాస్త్రవేత్తలు ఇటువంటి నాలుగు కేసులపై పరిశోధనలు సాగించారు. బెల్జియం, నెదర్లాండ్స్, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాలకు చెందిన ఇటువంటి కేసులపై పరిశోధనలు చేశారు. అయితే ఈ విషయంలో ఇంకా పరిశోధనలు సాగించాల్సివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.