Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : గాలిద్వారా కరోనా వ్యాప్తి.. స్పష్టం చేస్తున్న అంతర్జాతీయ నివేదికలు..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలితో కూడా వ్యాప్తి చెందుతున్నట్టుగా ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

corona virus : covid predominantly spreads through air lancet - bsb
Author
Hyderabad, First Published Apr 16, 2021, 5:16 PM IST

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలితో కూడా వ్యాప్తి చెందుతున్నట్టుగా ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది అనడానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ది లాన్సెట్ లోప్రచురితమైంది.

కరోనా వైరస్ కి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ 19కు కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ద్వారా వ్యాపిస్తుందన్న నివేదికలు ఆందోళనకు గురి చేశాయి. 

వీటిని నిర్ధారించేందుకు బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. చివరకు గాలి ద్వారా  కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చే 10 విషయాలను నివేదించింది.

కరోనావైరస్ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్ స్పైడర్ ఈవెంట్ కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టంచేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. 

వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్ సోకిన విషయాన్ని గుర్తు చేశారు. వారందరి పై జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టం చేశారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.

బైటి ప్రదేశాల లో కంటే మూసిఉన్న ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే క్లోజ్డ్ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 

అసింప్లమెటిక్ వ్యక్తుల నుంచి కరోనా వైరస్  నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40 శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేని వారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాల్లో వైరస్ వ్యాపిస్తుందనడానికి  ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరికొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటల్లో పక్కగదిలో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.

అయితే  తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువు లోనుంచి వైరస్ తేలికగా ఎలా ప్రసరిస్తుందనడానికి శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్ ఆఫ్ ఫ్లుయిడ్ ఫ్లోస్, బ్రతికున్న వైరస్ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాలు నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణుడు గ్రీన్ హాల్గ్  పేర్కొన్నారు. వీటిలో కొన్ని గాలిలో వ్యాప్తిని బలహీనమైనవిగా అంచనా వేసినప్పటికీ.. ఇది సాధ్యమవడానికి బలమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయని స్పష్టం చేశారు.

గాలిలో వైరస్ వ్యాపించడం తీవ్రమైనదని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస వల్ల వైరస్ గాలి లోకి వెళ్లడం ద్వారా ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు వైరస్ వారికి సోకుతుంది. ఇదే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చెందిన ఏరోసల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కింబర్లీ ప్రాథర్ స్పష్టం చేశారు.

గాలిలోలో వైరస్ వ్యాప్తి చెందకుండా సరైన వెంటిలేషన్,  ఎయిర్ ఫిల్టర్లు. ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా చూడడం, మూసిఉన్న ప్రాంతాల్లో తక్కువ సమయం ఉండేలా చూసుకోవడం, ఇండోర్ లో ఉన్నప్పుడు మాస్కులు ధరించడం, సాధారణ సమయాల్లోనూ నాణ్యమైన మాస్కులను వాడడం, కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈకిట్లను ధరించడం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు  నూతన మార్గదర్శకాల ద్వారా వైరస్ కట్టడికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అధ్యయన బృందం సూచించింది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు(సీడీసీ)  ఇదివరకే వెల్లడించింది. వీటిపై భారత్లో పరిశోధన చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కూడా ఇండోర్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios