కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కబళిస్తున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో బీభత్సం సృష్టించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువ మంది బలిగొంది. దీంతో అమెరికాలో మొత్తం మరణాలు సంఖ్య 9 లక్షలను దాటేసింది. ఇదిలా ఉండగా, యూకే నిపుణులు మరో ఆందోళనకర హెచ్చరికలు చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద వేవ్‌లు రావొచ్చని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: కరోనా(Coronavirus) మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా దాని నీడలోనే పలు దేశాలు గజగజ వణుకుతున్నాయి. అన్ని దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికా(America)ను ఈ మహమ్మారి ముచ్చెమటలు పట్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. ఈ దేశంలో కరోనా మరణాలు(Deaths) 9 లక్షల మార్క్ దాటేశాయి. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్, ఇండియాలు ఉన్నాయి. ఈ మూడు దేశాల్లో కలిపి కరోనా మరణాలు 18 లక్షలుగా ఉన్నాయి. కరోనా వైరస్ డెల్టా వేవ్‌తో ప్రపంచవ్యాప్తంగా మృత్యు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఒమిక్రాన్(Omicron Variant) కూడా మళ్లీ ఆ ప్రమాద ఘంటికలను మోగించింది. ఈ వేరియంట్ కారణంగానే అమెరికాలో మళ్లీ కరోనా మరణాలు పెరిగాయి. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 9 లక్షలను దాటేసింది.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోనే మరే ఇతర దేశం కంటే కూడా అమెరికాలోనే తీవ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, అమెరికాలోనూ ఇప్పుడిప్పుడే కరోనా మరణాల సంఖ్య కాస్త కోలుకుంటున్నదని వివరిస్తున్నారు. ఒమిక్రాన్ వేవ్ పీక్ స్టేజ్ నుంచి వెనక్కి తగ్గుతున్నది. పీక్ స్టేజ్‌లో వారం సగటున కరోనా మరణాలు 2,674గా ఉన్నది. కానీ, గత రెండు రోజులుగా ఈ సగటు 2,592కు పడిపోయింది.

ఇదిలా ఉండగా, యూకే నిపుణులు ఆందోళనకర విషయాలను పేర్కొన్నారు. ఇది వరకే ఈ మహమ్మారి డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో మరణాలు భారీగా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మహమ్మారి ఇంతటితో ఆగిపోవడం కాదు.. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద వేవ్‌లు రావొచ్చని యూకే ప్రభుత్వానికి కరోనా మహమ్మారి కట్టడికి సలహాలు ఇచ్చే సైంటిఫిక్ బాడీ తెలిపింది. రోజులు గడిచిన కొద్దీ కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ప్రజల్లో క్షీణిస్తుందని, అదే సమయంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్లూ ముందుకు రావచ్చని వివరించింది.. ఇది అత్యంత ఆందోళనకర విషయం అని వివరించారు. అలాంటి పెద్ద వేవ్‌లు ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం వేయవచ్చని, అందుకే యాక్టివ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనా కేసులు (Corona Cases) తగ్గుముఖం పట్టాయి. గత రెండు మూడు రోజులగా రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే 14 శాతం తక్కువగా కొత్త కేసులు ఉన్నాయి. తాజాగా 1,059 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,30,814 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 4,02,47,902కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కరోనా పాజిటివిటీ రేట్ కూడా భారీగా తగ్గింది.