పెరూలో ఓ పోలీసు గలీజు పని చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ వీడియో వైరల్ కావడంతో ఆ పోలీసు సస్పెండ్ అయ్యాడు. ఇంతకీ ఆ పోలీస్ చేసిన పని ఏంటంటే కేసుపెట్టుకుండా ఉండాలంటే లంచంగా ముద్దు పెట్టాలంటూ అమ్మాయితో బలవంతంగా ముద్దు పెట్టించుకోవడమే.

కేసు నుండి తప్పించేందుకు కొంతమంది పోలీసులు లంచం తీసుకుంటారన్న విషయం తెలిసిందే. లంచంగా డబ్బులో, బంగారమో, వస్తువుల రూపంలోనో తీసుకోవడం మామూలే. అయితే పెరూలోని ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఓ యువతిపై కేసు పెట్టకుండా వింత లంచం తీసుకున్నాడు.

నిబంధనలు అతిక్రమించినందుకు గానూ సదరు యువతిపై పోలీసు కేసు పెట్టాలి. కానీ కేసు పెట్టకుండా ఉండేందుకు తనకు లంచం ఇవ్వాలని అడిగాడా పోలీస్. తనకు ముద్దిస్తే కేసు పెట్టనని బేరం పెట్టాడు. 

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ముద్దు పెట్టింది. అయితే ఆ ముద్దు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరా ఉంది. దీన్ని పోలీసు గమనించలేదు. దీంతో అతడి బండారం బట్టబయలైంది. 

ఈ వీడియోను అక్కడి ఓ టీవీ చానల్ ప్రసారం చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.