గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, కమలం పార్టీలూ మెజార్టీ సాధించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో మద్దతు కూడగట్టుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీని ఈ రెండు పార్టీలు ఆశ్రయించాయి. తమకు సీఎం కుర్చీ ఇస్తేనే బీజేపీకి మద్దతు ఇస్తామనే డిమాండ్ ఈ పార్టీ చేస్తున్నట్టు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఈ పార్టీనే కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉన్నది.
పనాజీ: గోవా (Goa)లో మళ్లీ 2017 అసెంబ్లీ ఫలితాల సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలు పేర్కొన్నాయి. అటు కాంగ్రెస్(Congress), ఇటు బీజేపీ(BJP) రెండు పార్టీలు మెజార్టీ మార్క్‌ను అందుకోలేవని స్పష్టం చేశాయి. మూడో పార్టీపై ఆధారపడక తప్పనిపరిస్థితి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మినహా పార్టీల వేట ప్రారంభం అయింది. అందులోనూ తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి గోవాలో డిమాండ్ అమాంతం పెరిగింది. ఆ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు ఆశ్రయించాయి. మెజార్టీకి కొన్ని సీట్లు తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నందున తమకు మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలూ కోరాయి. దీంతో గోవాలో జీఎంపీ హాట్‌గా మారింది. జీఎంపీ పార్టీనే కింగ్ మేకర్‌గా అవతరించనుందా? అనే విషయం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉన్నది.
గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రావడంతో సీఎం ప్రమోద్ సావంత్ వాటిని కొట్టిపారేశారు. బీజేపీ స్వయంగా మెజార్టీ సీట్లు సాధిస్తుందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పనైతే చెప్పారు. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో మాట్లాడారు. ఈ హంట్ అసెంబ్లీ అంశాన్ని ప్రస్తావించారు. ఒక వేళ నిజంగానే మెజార్టీ సీట్లు సాధించని యెడల ఏ పార్టీని ఆశ్రయించాలి అనే అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. కాగా, ఆ సమావేశం తర్వాత తదుపరి బీజేపీ ప్రభుత్వానికి తానే సీఎం అని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
కాగా, ఎంజీపీ చట్టసభ్యుడు సుదీన్ ధవలీకర్ మాట్లాడుతూ, తాము అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశామని, ఫలితాలు వచ్చాక ఆ పార్టీతో సమావేశం అవుతామని, ఎన్నికల అనంతరం పొత్తుపైనా చర్చిస్తామని వివరించారు. ఆ తర్వాతే ఏ పార్టీలతో మద్దతు అనే విషయాన్ని చర్చిస్తామని చెప్పారు.
అదే సందర్భంలో తాము సీఎంగా ప్రమోద్ సావంత్ కొనసాగితే బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదని స్పస్టం చేశారు. ఎందుకంటే.. మనోహర్ పారికర్ తర్వాత సీఎంగా పదవి చేపట్టిన ప్రమోద్ సావంత్ క్యాబినెట్‌లోని తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులను తొలగించారని ఫైర్ అయ్యారు. అయితే, బీజేపీకి తాము మద్దతు ఇవ్వబోమనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. భవిష్యత్‌లో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే, తమకే సీఎం సీటు కావాలనే డిమాండ్‌తో ఎంజీపీ ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పార్టీని ఆశ్రయించినట్టు తెలిసింది. తమ పార్టీకి మెజార్టీ సీట్లు రాకుంటే.. ఎంజీపీ మద్దతు తీసుకోవాలని ఆలోచించినట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ అంతటితో ఆగిపోలేదు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ప్రత్యర్థులైన టీఎంసీ, ఆప్‌లతోనూ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే గోవాలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము కలిసి అడుగేయడానికి సిద్ధం అని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ నెల పదో తేదీన ఫలితాలు వెలువడతాయి.
