చైనాకు చెందిన ఓ వ్యక్తి 2020లో కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కోమాలోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన స్పృహలోకి వచ్చే అవకాశాలు స్వల్పమని వైద్యులు చెప్పారు. అయినా..తన భర్త ఏదో ఒకరోజైనా తప్పకుండా స్పృహలోకి వస్తాడని భార్య రాజీ లేకుండా పని చేసింది. ఈ క్రమంలో విరాళాలు పొందింది. తన భర్త మళ్లీ మెలకువలోకి రావడంతో రూ. 21 లక్షలు తిరిగి ఇచ్చేసింది. 

న్యూఢిల్లీ: ఆమె తన భర్తనే జీవితం అన్నట్టుగా బ్రతికింది. తన భర్త కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు కూడా ఆయన తిరిగి స్పృహలోకి రావడం దాదాపు అసాధ్యమనీ ఆమెకు చెప్పారు. కానీ, ఆమె మాత్రం పిచ్చి ప్రేమతో మూడేళ్లుగా ఆయన చుట్టే గడిపింది. ఈ విషయం తెలిసిన పలువురు ఆమెకు విరాళాలు పంపారు. అయితే, ఆమె భర్త ఊహించని విధంగా మెలుకువలోకి వచ్చాడు. ఆమె పొంగిపోయింది. ఇంత కాలం నైతికంగా తన వెంటే ఉన్నా.. తన భుజం తట్టిన వారందరినీ ఆమె గుర్తు చేసుకుంది. వారు పంపించిన విరాళాలను తిరిగి వారికి పంపించింది. ఇలా సుమారు రూ. 21.7 లక్షల విరాళాలను తిరిగి ఇచ్చేసింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సీఎంపీ) ఈ కథనం ప్రచురించింది. చైనా తూర్పు ప్రాంతంలోని జియాంగ్సుకు చెందిన జియాంగ్ లీ, డింగ్‌లు భార్య భర్తలు. జియాంగ్ లీ 2020లో కారు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి భార్య ఆయన ఆలనా పాలనా చూసుకుంటున్నది. ఇప్పుడు కోమాలో నుంచి మెలుకువ వచ్చింది. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాడు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. పళ్లు తోముకుంటున్నాడు. తన భర్త ఆహారం తింటున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.

Also Read: ఆత్మహత్య.. రాజద్రోహం! ఉత్తరకొరియాలో ఏకంగా కుటుంబాలే సూసైడ్, కిమ్ అత్యవసర సమావేశాలు

కారు యాక్సిడెంట్ తర్వాత 2020లో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఆయన తిరిగి స్పృహలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఆయన కోమాలో ఉన్నప్పుడూ ప్రతి రెండు గంటలకు ఒకసారి మసాజ్ చేసేది. తద్వార మసల్ అట్రోపిని నివారించగలిగింది.

జియాంగ్ వైద్యానికి వారి సేవింగ్‌లో సింహ భాగం డబ్బులు ఖర్చు అయ్యాయి. దీంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది. 4,055 మంది దాతల నుంచి 26 వేల అమెరికన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. 

ఆమె తన భర్తను చూసుకోవడం రాజీ పడలేదు. ఆమెకు వచ్చిన ప్రతి విరాళం ఎవరికి నుంచి వచ్చిందో రాసి పెట్టుకుంది. ఇప్పుడు తన భర్త మళ్లీ కోమా నుంచి బయటపడటంతో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నది.