Asianet News TeluguAsianet News Telugu

భూగర్బంలోకి 33వేల అడుగుల లోతైన రంధ్రాన్ని తొవ్వుతున్న చైనా.. వివరాలు ఇవే..

చైనా శాస్త్రవేత్తలు భూపొర‌ల‌ లోతుల్లోకి భారీ రంద్రం తవ్వడం మొదలుపెట్టారు. భూమి క్రస్ట్‌లోకి 10,000 మీటర్లు (32,808 అడుగులు) రంధ్రం చేయనున్నారు.

China starts Drilling a 10000 Meter Deep Hole Into Earth Crust ksm
Author
First Published May 31, 2023, 4:29 PM IST

చైనా శాస్త్రవేత్తలు భూపొర‌ల‌ లోతుల్లోకి భారీ రంద్రం తవ్వడం మొదలుపెట్టారు. భూమి క్రస్ట్‌లోకి 10,000 మీటర్లు (32,808 అడుగులు) రంధ్రం చేయనున్నారు. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఈ రంద్రం తవ్వే ప్రక్రియ చేపట్టారు. భూగర్భ అన్వేషణలో భాగంగా చైనా శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ.. జిన్హువా న్యూస్ వివరాలు వెల్లడించింది. అత్యంత లోతైన బోర్‌హోల్ కోసం డ్రిల్లింగ్‌ మంగళవారం దేశంలోని చమురు సంపన్న జిన్‌జియాంగ్ ప్రాంతంలో ప్రారంభమైందిని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. మంగళవారం చైనా విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది. జియుకాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌ మార్చ్‌–2ఎఫ్‌ రాకెట్‌ ద్వారా వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ముగ్గురు వ్యోమగాములలో ఆ దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్ హైచావో కూడా ఉన్నారు.  ముగ్గురు వ్యోమగాయులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. ప్రయోగం  విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్‌ఏ) పేర్కొంది. దీంతో చైనా భూమి ఉపరితలం పైన, దిగువన కొత్త సరిహద్దులను ఒకే సమయంలో అన్వేషిస్తున్నట్టు అయింది. 

భూగ‌ర్భ ప‌రిశోధ‌న‌ల విషయానికి వస్తే.. ప్రస్తుతం మొదలైన తవ్వకాలు రాతి పొరలను భూమి అడుగున ఉన్న 10 రాతి పొరలను చొచ్చుకుపోయి.. భూపటలంలోని క్రెటేషియస్ వ్యవస్థను చేరుకోనుంది. ఇది దాదాపు 145 మిలియన్ సంవత్సరాల నాటి శిలలను కలిగి ఉంటుంది. అయితే ఈ డ్రిల్లింగ్ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ‘‘డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ కష్టాన్ని రెండు సన్నని స్టీల్ కేబుల్స్‌పై డ్రైవింగ్ చేసే పెద్ద ట్రక్కుతో పోల్చవచ్చు’’ అని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని శాస్త్రవేత్త సన్ జిన్‌షెంగ్ అన్నారు. 

ఇక, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2021లో దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. లోతైన భూమి అన్వేషణలో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రక్రియ ఖనిజ, శక్తి వనరులను గుర్తించగలదని.. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి పర్యావరణ విపత్తుల ప్రమాదాలను అంచనా వేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. 

ఇదిలాఉంటే, భూమిపై అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం ఇప్పటికీ రష్యన్ కోలా సూపర్‌డీప్ బోర్‌హోల్. ఇది 20 సంవత్సరాల డ్రిల్లింగ్ తర్వాత 1989లో 12,262 మీటర్ల (40,230 అడుగులు) లోతుకు చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios