ఉక్రెయిన్ అంశమై.. అమెరికాపై చైనా విరుచుకుపడింది. చైనా పై అమెరికా తరుచూ విషపూరిత దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి చైనా నుంచి రష్యా మిలిటరీ సహకారాన్ని కోరిందని అమెరికా తరుచూ ఆరోపణలు చేస్తున్నదని, కానీ, అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగా.. అమెరికా, పశ్చిమ దేశాలు తీవ్రస్థాయిలో పుతిన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులను కట్టడి చేయడానికి రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నది. అయితే, ఆ ఆంక్షల నుంచి రష్యా తప్పించుకునేందుకు వేరే ఏ ఇతర దేశం సహకరించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా పలుమార్లు హెచ్చరించింది. ముఖ్యంగా దాని టార్గెట్ చైనాపైనే ఉన్నది. రష్యాకు చైనా సహకరించొద్దని నొక్కి చెబుతున్నది. అంతేకాదు, ఉక్రెయిన్‌లో యుద్ధానికి చైనాను రష్యా సహకారం అడిగిందని అమెరికా ఆరోపించింది. చైనా ఆయుధాలు పంపాలని రష్యా కోరినట్టుగా తమ వద్ద సమాచారం ఉన్నదని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను అటు రష్యా, ఇటు చైనా రెండు దేశాలు ఖండించాయి.
మంగళవారం అమెరికా చేసిన వాదనలను చైనా కొట్టేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి చైనాను రష్యా మిలిటరీ సహాయం కోరిందని అమెరికా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. అమెరికా ప్రభుత్వం విషపూరిత దుష్ప్రచారం చేస్తున్నదని ఫైర్ అయింది. ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న ఘర్షణలను మరింత ఎగదోసేలాగే ఉన్నాయని పేర్కొంది.
ఉక్రెయిన్ అంశంపై అమెరికా తరుచూ చైనా గురించి తప్పుడు ప్రచారం, విషపూరిత దుష్ప్రచారం చేస్తున్నదని లండన్‌లోని చైనా ఎంబసీ ఓ ప్రకటనలో ఖండించింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి చర్చలను కొనసాగించడానికి చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నదని వివరించింది. ప్రస్తుతం అందరి ముందు ఉన్న అంశం ఏమంటే.. అక్కడి ఉద్రిక్తత పరిస్థితులను తొలగించాలని, కానీ, అందుకు భిన్నంగా ఆ యుద్ధానికి ఆజ్యం పోయరాదని సూచనలు చేసింది. వీలైనంత తొందరగా ఆ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి దౌత్య మార్గాలు అన్వేషించాలని తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో వారంలోకి చేరింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై బాంబులు వేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ నగరాలను ధ్వంసం చేస్తూ వస్తున్నది. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దాని కంటే కూడా భారంగా మారినట్టు తెలుస్తున్నది. బహుశా అందుకే చైనాను ఆయుధ సహకారం కోరి ఉండవచ్చని కొందరు నిపుణులు చర్చిస్తున్నారు. ఔను.. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగించడానికి చైనా నుంచి ఆయుధ సహకారాన్ని రష్యా కోరిందని అమెరికాలోని శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి. తమ పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ వర్గాలు రష్యా ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని గతంలోనూ చైనాకు చేసిందని పేర్కొన్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన వెంటనే చైనాను ఆయుధ సహకారం కోరిందని, ఇటవలే మరోసారి కోరిందని వివరించాయి.
అయితే, రష్యా అడుగుతున్న సహాయానికి చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒక వేళ రష్యాకు ఆయుధ సహకారాన్ని అందించి 1972లో నిర్దేశించుకున్న విదేశాంగ విధానాన్ని మార్చుకోబోతుందా? లేక పాత విధానాన్నే కొనసాగిస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నదని వివరించాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా ఇప్పటి వరకు ఖండించలేదు.
