చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 132 మంది మృతిచెంది ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే విమాన ప్రమాద కారణాలు తెలుసుకోవడానికి అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 

చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 132 మందితో వెళ్తున్న China Eastern airlinerకు చెందిన విమానం కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా ప్రమాదదం అనంతరం ప్రాణాలతో బయటపడినట్టుగా ఆధారాలు లభించలేదు. ప్రమాదం అనంతరం రెస్క్యూ బృందాలు తీవ్రమైన గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లభించకపోవడం.. విమానం ప్రమాదంలో 123 మంది ప్రయాణికులతో పాటు, తొమ్మిది మంది సిబ్బంది మరణించి ఉంటారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఇక, విమాన ప్రమాద కారణాలపై చైనా అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విమానంలోని బ్లాక్ బాక్స్‌ను పరిశోధన బృందాలు కనుగొన్నాయి. 

చైనా ఈస్టర్న్ MU5735 నుంచి ఫ్లైట్ రికార్డర్ కనుగొనబడిందని చైనా ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి లియు లుసాంగ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నదని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. మరి ఈ బ్లాక్ బ్లాక్స్ విశ్లేషణ ద్వారా విమాన ప్రమాదానికి గల కారణాలు ఏ మేరకు తెలుస్తాయో చూడాలి. 

ఇక, బోయింగ్ 737-800 రెండు ఫ్లైట్ రికార్డర్‌లను కలిగి ఉంటుంది. ఒకటి వెనుక ప్రయాణీకుల క్యాబిన్‌లో ఉండే ఫ్లైట్ డేటా ట్రాకింగ్.. మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. అయితే ప్రస్తుతం లభించినందని డేటా ట్రాకింగ్ రికార్డరా..? లేదా కాక్‌పిట్ వాయిస్ రికార్డరా..? అనేది అస్పష్టంగా ఉందని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAAC) అధికారి మావో యాన్‌ఫెంగ్ చెప్పారు.

ఇక, దక్షిణ గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో సోమవారం మధ్యాహ్నం 132 మంది‌తో వెళ్తున్న బోయింగ్ 737-800 విమానం కుప్పకూలింది. కున్‌మింగ్ నుంచి గ్వాంగ్జూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయిందని.. ఆ తర్వాత వెంటనే పేలుడు సంభవించిందని అక్కడి మీడియా రిపోర్ట్ చేసింది. అయితే ప్రయాణం ప్రారంభమైన తర్వాత గంటకు పైగా విమానం మాములుగానే ప్రయాణించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టమ్ డేటా చెబుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం ప్రయాణిస్తున్న మార్గంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు లేవని చైనా ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. 

అయితే విమానం ఎత్తులో అకస్మాత్తుగా మార్పు సంభవించిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ FlightRadar24 పేర్కొంది. విమాన ప్రయాణ ఎత్తులో మార్పుకు ముందువరకు విమానం సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాధారణ కమ్యూనికేషన్‌ను కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. అయితే బోయింగ్ 737-800 కేవలం ఒక నిమిషం వ్యవధిలో 29,100 అడుగుల ఎత్తు నుండి 7,850 అడుగుల (సుమారు 8,900 నుండి 2,400 మీటర్లు) వరకు పడిపోయింది. ఇక, ఈ ప్రమాదానికి గల కారణాలనే అన్వేషించడానికి అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.