2020 గాల్వాన్ లోయ ఘర్షణలో పాల్గొన్న చైనా సైనికుడిని బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ కు టార్చ్ బేరర్ గా ఆ దేశం ఎంచుకుంది. దీనిపై అమెరికా సెనేటర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఒలింపిక్స్ క్రీడ‌ల నుంచి రాజ‌కీయాల‌ను దూరంగా ఉంచాల‌నే నిబంధ‌న‌ల‌ను చైనా మ‌రో సారి తుంగ‌లో తొక్కింది. 2022 బీజింగ్ వింట‌ర్ ఒల‌పింక్స్ కు చైనా PLA రెజిమెంట్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ క్వి ఫాబావోను వింటర్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌గా మార్చారు. అత‌డు 2020లో భారత సైనికులతో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో తలకు గాయమై కోమాలో ఉన్నాడు. అత‌డు చైనా సైనికుల‌కు క‌మాండింగ్ అధికారిగా ఉన్నాడు. దీనిని యునైటెడ్ స్టేట్స్ సెనేట్ కమిటీ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ర్యాంకింగ్ సభ్యుడు జిమ్ రిష్ తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ ఉయ్ఘర్లపై మారణహోమం అమలు చేసిన కమాండర్ ను వింటర్ ఒలంపిక్స్ కు టార్చ్ బేర‌ర్ గా ఎంచుకోవ‌డం అవ‌మానక‌ర చ‌ర్య‌’’ అని ఆయ‌న పేర్కొన్నారు. ఉయ్ఘర్ స్వేచ్ఛ, భారతదేశ సార్వభౌమాధికారానికి మద్దతు ఇవ్వడంలో యునైటెడ్ స్టేట్స్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ట్వీట్ చేశారు. చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్ ప్ర‌కారం.. చైనీస్ సైనిక అధికారి వింటర్ ఒలింపిక్ పార్క్‌లో నాలుగుసార్లు ఒలింపిక్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్ వాంగ్ మెంగ్ నుండి జ్యోతిని అందుకున్నారు. ఈ వింట‌ర్ ఒలంపిక్స్ శుక్ర‌వారం ప్రారంభం కానున్నాయి. అయితే ఉయ్ఘ‌ర్ ముస్లిం పట్ల చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల యూఎస్, యూకే, భార‌త్ తో పాటు మ‌రికొన్ని దేశాలు ఈ క్రీడ‌ల‌ను బ‌హిష్క‌రించాయి. ఈ వింట‌ర్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకుల‌కు భార‌త్ నుంచి ఎవ‌రూ హాజ‌రుకాలేదు. 

Scroll to load tweet…

2020 సంవ‌త్స‌రంలో గాల్వాన్ లోయ‌లో భార‌త్ కు చైనా కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త సైనికులు, 40 మంది చైనా సైనికులు మ‌ర‌ణించారు. అయితే చైనా మాత్రం అధికారికంగా న‌లురుగు సైనికులు మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప్ర‌క‌టించారు. ఇది కూడా ఎనిమిది నెలల త‌రువాత నిర్దారించింది. 1967 తర్వాత రెండు సైన్యాల మధ్య జరిగిన మొదటి హింసాత్మక ఘటన ఇది. అయితే ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో పాల్గొని కోమాలోకి వెళ్లిన లెఫ్టినెంట్ కల్నల్ క్వి ఫాబావో వింట‌ర్ ఒలంపిక్స్ టార్చ్ బేర‌ర్ గా చైనా మార్చింది. ఈ వింట‌ర్ ఒలంపిక్స్ 1,200 మంది టార్చ్ బేరర్‌లలో అత‌డిని ఒక‌రిగా చేర్చుకున్న‌ట్టు పేర్కొన్న చైనా మీడియా గ్లోబ‌ల్ టైమ్స్.. హిమాలయ యుద్ధంలో అతని పాత్రను ‘‘హీరో’’గా పేర్కొంది. పోరాట సమయంలో తలకు బలమైన గాయం అయిన క్విని గౌరవించింది.

2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇండియా, చైనా రెండూ గాల్వాన్ లోయ, చుట్టుపక్కల పదివేల మంది అదనపు దళాలను మోహరించాయి. గతేడాది చివర్లో జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యాయి.