ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. 

ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. గత 20 నిమిషాలుగా వందలాదిమంది చాట్ జిపిటి వినియోగదారులు సమస్యను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తున్నారు. 

వెబ్ సైట్స్ పనితీరును ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం... ఇండియాలో కూడా చాట్ జిపిటి వినియోగదారులు సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు 439 యూజర్స్ రిపోర్ట్ చేసినట్లు ఈ వెబ్ సైట్ వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డౌన్ డిటెక్టర్ పేర్కొంది.

ఓపెన్ ఏఐకి చెందిన ఈ చాట్ జిపిటి వాడకంలో తమకు సమస్యలేవీ తలెత్తడంలేదని ఇదే సమయంలో కొందరు యూజర్స్ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నారు. దీన్నిబట్టి చాట్ జిపిటి సమస్య కొంతమంది యూజర్లకే పరిమితం అయ్యిందని అర్థమవుతోంది. 

ఈ జనవరి 23, 2025 న కూడా ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇలా స్పెయిన్, అర్జెంటినా, యూఎస్ లోని వినియోగదారులకు చాట్ జిపిటి సేవలు నిలిచిపోయాయి. తర్వాత ఫిబ్రవరి 5న కూడా ఇలాగే జరిగింది. అయితే సమస్యను పరిష్కరించడంతో యధావిధిగా సేవలు కొనసాగాయి.