కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ ఎవరూ మందు కూడా కనిపెట్టలేకపోయారు. కాగా.. ఈ మహమ్మారి విషయంలో తాజాగా అమెరికాలోని సెంటర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రెవెన్షన్ డైరెక్టర్  రాబర్ట్ రెడ్ ఫీల్డ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మాస్క్ అత్యంత ప్రభావశీలమైనదని ఆయన పేర్కొన్నారు. ‘మన వద్ద ఉన్న శాస్త్రీయమైన ఆధారాలు ఇదే నిరూపిస్తున్నాయి. కరోనాను మనల్ని కాపాడే అత్యంత ప్రభావశీలమైన సాధనం మాస్కు! ఆ మాటకొస్తే.. టీకా కన్నా కూడా మాస్కే మనల్ని గ్యారెంటీగా కరోనా నుంచి కాపాడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీకా అందుబాటులోకి వచ్చినా కూడా మాస్కులు ధరించడం కొనసాగించాలని రెడ్ ఫీల్డ్ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వినియోగిస్తే కరోనా మహమ్మారికి తొందరగా అదుపులోకి తేవచ్చని చెప్పారు.  

కరోనా టీకా ఈ ఏడాది చివరికి గానీ లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలోగానీ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి ప్రజల్ని టీకా ఎంతమేరకు రక్షింస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం నిపుణుల వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు.

తొలి దశలో లభ్యమయ్యే టీకాలు ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో రక్షణ కల్పించలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 75 శాతం మందికి రక్షణ లభిస్తే మనల్ని మనం అదృష్టవంతులుగా భావించాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. టీకా కనీసం 50 శాతం రక్షణ కల్పిస్తుందని రుజువైతే విధానపరమైన అనుమతులు జారీ చేస్తామని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాస్కుల ప్రాముఖ్యాన్ని విశదీకరిరంచారు.