కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. గత ఏడాది మొదలైన ఈ మహమ్మారి ఇప్పటికీ విలయతాండవం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కి మందు కనుగొనలేదు. వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది. తగ్గినట్లే తగ్గి కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కెనడా ప్రభుత్వం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కెనడా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఆదివారం పబ్లిక్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రిపరెడ్నెస్స్ మినిస్టర్ బిల్ బ్లెయిర్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరులపై డిసెంబర్ 31 వరకు, అలాగే ఇతర దేశాలకు చెందిన వారిపై జనవరి 21 వరకు ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. 

అంతేగాక అనవసర ప్రయాణాలు కలిగిన ఇతర దేశాలకు చెందిన పౌరులను మార్చి 16 వరకు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, అత్యవసరమైన కార్మికులు, సీజనల్ వర్కర్స్, సంరక్షకులు, అంతర్జాతీయ విద్యార్థులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇప్పటివరకు కెనడాలో 3.70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12 వేలకు పైగా మంది ఈ వైరస్‌కు బలయ్యారు.