Myanmar Earthquake 2025: మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపాలపై కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి 

Myanmar Earthquake 2025: మయన్మార్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అయితే.. ఈ సంవత్సరం ప్రారంభంలో సాగింగ్ ఫాల్ట్ వెంట 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం దేశాన్ని ఉత్తరం నుండి దక్షిణం వరకు కుదిపేసింది. ఈ విపత్తులో వేలాది ప్రాణాలు కోల్పోయారు, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. శాస్త్రవేత్తలు ఈ ఘటనను ప్రపంచానికి పరోక్ష హెచ్చరికగా భావించాలి. భూకంప అంచనాలను తిరిగి సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవాలి.

మయన్మార్‌లో 2025 మార్చి 28న సంభవించిన 7.7 తీవ్రత భారీ భూకంపంపై కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి భూకంప సమయంలో భూమి కదలికలను అంచనా వేశారు. మొదట ప్రకంపనలు 300 కి.మీ పరిధి వరకు మాత్రమే ఉన్నాయనీ భావించారు. 

అయితే వాస్తవానికి అది 500 కి.మీ పైగా విస్తరించిందని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. ఈ విపరీతమైన కదలిక భూకంపాలను అంచనా వేసే విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరాన్ని చూపిస్తోంది. సాంప్రదాయ భూకంప నమూనాలు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవని, భవిష్యత్తులో భూకంపాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

కాలిఫోర్నియాలోని సాగింగ్ , శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లు కూడా ఇంతకు ముందే అంచనా వేసిన దానికంటే చాలా పెద్దవిగా ఉన్నాయని, అందువల్ల భవిష్యత్తులో మరింత భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ సందర్భంగా కాల్టెక్ పోస్ట్‌డాక్టోరల్ రిసర్చర్ సోలీన్ ఆంటోయిన్ మాట్లాడుతూ మయన్మార్‌లో 2025లో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం మా కొత్త ఇమేజింగ్ పద్ధతులను పరీక్షించడానికి సరైన అవకాశం ఇచ్చింది. 

ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ పద్ధతులు భూమి కదలికలను ఖచ్చితంగా కొలుస్తాయి. ముఖ్యంగా పాత పద్ధతులు గుర్తించలేని దిశల్లో కూడా ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వివరాలను పొందగలిగామని తెలిపారు. ఈ అధ్యయనం స్పష్టం చేసింది ఏమిటంటే.. భూకంపాలను అంచనా వేయడానికి ఇప్పటివరకు వాడుతున్న సాంప్రదాయ విధానాలు సరిపోవు. కొత్త ఇమేజింగ్ పద్ధతులు, ఉపగ్రహ ఆధారిత డేటా, రియల్‌టైమ్ విశ్లేషణలతోనే భూకంప అంచనాలు ఖచ్చితంగా చేయగలమని నిపుణులు తేల్చారు.

ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ఆగస్టు 11న ప్రచురితమైన కాల్టెక్ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు భూకంప అంచనాల్లో ప్రధానంగా “సమయం-స్వతంత్రం” (Time-Independent) మోడల్స్‌ను వాడుతున్నారు. వీటి ప్రకారం, ఒక ప్రాంతంలో వచ్చే 30 ఏళ్లలో భూకంపం సంభవించే అవకాశాన్ని మాత్రమే లెక్కిస్తారు. అయితే ఇవి ఫాల్ట్ (Fault) ఎంత కదిలిందో, ఎంత ఒత్తిడి (Stress) పెరిగిందో పరిగణనలోకి తీసుకోవు. మయన్మార్‌లో 2025లో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం ఈ విధానం లోపాలను బహిర్గతం చేసింది. ఇవి ఊహించిన విధంగా ప్రవర్తించవని, ఎప్పుడైనా అనూహ్యంగా భారీ ప్రకంపనలు రావచ్చని ఈ పరిశోధన స్పష్టం చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భూకంప అంచనాలను పూర్తిగా కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రియల్‌టైమ్ డేటా, ఉపగ్రహ విశ్లేషణ, ఫాల్ట్ కదలికల ఆధారంగా కొత్త మోడల్స్ అభివృద్ధి చేయడం అత్యవసరమని తెలిపింది.

కల్టెక్ ప్రొఫెసర్ జీన్-ఫిలిప్ అవౌక్ అధ్యయనంపై మాట్లాడుతూ.. భవిష్యత్తులో భూకంపాలు గత భూకంపాల్లా పునరావృతం కావు. భవిష్యత్తు మరింత తీవ్రస్థాయిలో భూకంపాలు సంభవించవచ్చునని తెలిపారు. రికార్డులు చాలాసార్లు తగినంత సమాచారం అందలేవనీ, అందుకే పరిశోధన, ఉపగ్రహ చిత్రాలు, రియల్‌టైమ్ డేటా వాడటం అత్యవసరం అన్నారు. దీని ద్వారానే ఖచ్చితమైన భూకంప అంచనాలు సాధ్యమవుతుందని తెలిపారు.

 ఈ పరిశోధనలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF),యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS),స్టేట్‌వైడ్ కాలిఫోర్నియా భూకంప కేంద్రం (SCEC),అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పాల్గొన్నారు. మయన్మార్ భూకంపం నేర్పిన ఈ పాఠాలు భవిష్యత్తు ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతాయి. చివరికి, ఈ అవగాహన భవిష్యత్తులో వేలాది ప్రాణాలను కాపాడే అవకాశముందని భావిస్తున్నారు.