బ్రిటన్ నౌక మార్లిన్ లువాండాపై హౌతీల దాడి.. కాపాడిన ఇండియన్ నేవీ..
గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ( Gulf of Aden)లో హౌతీలు (Houthi’s) రెచ్చిపోతున్నారు. అమెరికా, బ్రిటన్ నౌకలపై దాడులు చేస్తున్నారు. తాజాగా రష్యా నుంచి చమురు తీసుకొని వస్తున్న బ్రిటన్ కు చెందిన నౌక మార్లిన్ లువాండా (Britain's ship Marlin Luanda) పై దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఐఎన్ఎస్ విశాఖ ( INS Vishakhapatnam) ఆ నౌకను కాపాడింది.
గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లో హౌతీల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రిటన్ కు చెందిన మార్లిన్ లువాండా నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. దీంతో ఆ నౌకలో ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఇండియన్ నేవీ అలెర్ట్ అయ్యిది. వెంటనే భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ హుటా హుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసింది.
ఈ నౌకలో 22 మంది భారతీయులు, బంగ్లాదేశ్ కు చెందిన ఒకరు ఉన్నారు. కాగా..క్షిపణి దాడి అనంతరం తమ నౌకలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు సహకరించిన భారత నావికాదళానికి ఎంవీ మార్లిన్ లువాండా మాస్టర్ కెప్టెన్ అవినాష్ రావత్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీ మార్లిన్ లువాండా సిబ్బందితో కలిసి ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు భారత నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు.
అత్యవసర సహాయం అందించాలని ఎంవీ మార్లిన్ లువాండా అభ్యర్థన మేరకు ఐఎన్ఎస్ విశాఖపట్నం తన ఎన్బీసీడీ (న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్) బృందాన్ని అగ్నిమాపక పరికరాలతో పాటు మోహరించిందని భారత నౌకాదళం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నౌకలో 22 మంది భారతీయులు, బంగ్లాదేశ్ కు చెందిన ఒకరు ఉన్నారు.
ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలను ఆవరించి ఉన్న విస్తృత ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఈ ఘటన తాజాది. కాగా.. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో మార్షల్ ఐలాండ్ ఫ్లాగ్ షిప్ డ్రోన్ దాడిని ఎదుర్కొన్న కొద్దిసేపటికే తొమ్మిది మంది భారతీయులతో సహా 22 మంది సిబ్బందితో వెళ్తున్న సరుకు రవాణా నౌకను ఐఎన్ ఎస్ విశాఖపట్నం అడ్డుకుంది. అలాగే జనవరి 5న ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియాకు చెందిన ఎంవీ లీలా నార్ఫోక్ నౌక హైజాక్ ను నేవీ విజయవంతంగా నిరోధించింది.
ఇదిలా ఉండగా.. మార్లిన్ లువాండా ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన భారత్ పై, ఇండియన్ నేవీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరేబియా సముద్రంలో నౌకా రవాణాకు భారతదేశం భద్రత కల్పిస్తోందని, కానీ జిబౌటీలో స్థావరాన్ని కలిగి ఉన్న చైనా అలా చేయడం లేదని, అగ్రరాజ్యాల సరసన భారత్ నిలుస్తోందని ప్రశంసలు అందుతున్నాయి.