ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వణికిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యలు నుంచి ప్రముఖుల వరకు అంతా దీని బారినపడుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కోవిడ్ 19 బారినపడ్డారు.

తనకు పాజిటివ్ వచ్చినట్లుగా బోల్సోనారో మంగళవారం తెలిపారు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్‌లో తన మద్ధతుదారులతో మాట్లాడారు.

Also Read:కరోనాను మించిన మరో ప్రాణాంతక వైరస్.. మెదడులోకి దూరి..

ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని బోల్సోనారో చెప్పారు. ఇటీవల ఆయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు.

ఆ రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు బొల్సొనారో కుటుంబసభ్యులతో పాటు ఆయనను ఇటీవల కలిసిన వారిని గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Also Read:గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: డబ్ల్యుహెచ్ఓ కి సైంటిస్టులు లేఖ

కాగా మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది పాజిటివ్‌గా తేలడంతో బొల్సోనారోకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆయనకు మూడు సార్లు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు కోవిడ్ ఉగ్రరూపం దాలుస్తున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో 15,00,000 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా అక్కడ 65,000 మంది ప్రాణాలు కోల్పోయారు.