జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేది అనుమానంగా కనిపిస్తోంది.. ప్రస్తుతం బ్రిటన్‌లో వెలుగు చూస్తున్న కొత్త కరోనా స్ట్రెయిట్ నేపథ్యంలో ప్రధాని భారత పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. 

కరోనా కొత్త స్ట్రెయిట్ ఇలానే కొనసాగితే తమ ప్రధాని భారత్‌కు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు.

దీంతో జాన్సన్ భారత్ రావడం సాధ్యం కాకపోవచ్చనే చర్చ మొదలైంది. అయితే బోరిస్ జాన్సన్ పర్యటనకు దాదాపు 5 వారాల సమయం ఉందని పలువురు గుర్తుచేస్తున్నారు. అందువల్ల భారత పర్యటన గురించి ఇప్పుడే పూర్తి అభిప్రాయానికి రావడం సాధ్యపడదని పలువురు వాదిస్తున్నారు.

బ్రిటన్ రాజధాని లండన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉందని, ఈ లాక్‌డౌన్ వల్ల కొత్త కరోనా వైరస్‌ను నియంత్రించగలిగితే కచ్చితంగా ప్రధాని.. భారత్‌కు వెళ్లే అవకాశాలు వుంటాయని వైద్యులు అంటున్నారు. 

కాగా, కరోనా వైరస్‌లో మొత్తం 17 రకాల మార్పులను గత సెప్టెంబరులో ఆగ్నేయ బ్రిటన్‌ పరిధిలో గుర్తించారు. ఇందులో బీ117గా పిలువబడే మార్పు చెందిన కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు తెలిపారు.

గత వైరస్‌తో పోల్చితే ఇదేమీ ప్రాణాంతకం కాకపోయినా.. దీని వ్యాప్తి అధికంగా ఉండడం వల్ల ఈ వైరస్‌ను నియంత్రించడం వైద్య ప్రపంచానికి  సాధ్యం కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.