అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై తీవ్ర హెచ్చరికలు చేశారు. రష్యా ఆర్ధిక వ్యవస్థను స్ధంభింపజేస్తామని హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన స్టేట్ ఆఫ్ యూనియన్ లో బైడెన్ ప్రసంగించారు.
వాషింగ్టన్: Ukraineపై దాడులకు గాను Russia మూల్యం చెల్లించుకోకతప్పదని USA అధ్యక్షుడు Joe Biden హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాడు స్టేట్ ఆఫ్ యూనియన్ లో ప్రసంగించారు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ దాడి గురించి ప్రసంగించారు. ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తగిన బుద్ది చెబుతామని బైడెన్ హెచ్చరించారు. రష్యా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో రష్యా సైన్యాన్ని బలహీనపరుస్తామని ఆయన తేల్చి చెప్పారు.
రష్యా క్లెప్టోక్రాఫ్ట్ పాలకవర్గ సభ్యులతో బైడెన్ నేరుగా మాట్లాడారు. మీ విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ జెట్‌లను అమెరికా స్వాధీనం చేసుకొంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. రష్యా దాడులు చేస్తున్నా కూడా ఉక్రెయిన్ ప్రజలు కూడా రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని బైడెన్ అభినందించారు. మంగళవారం నాడు రాత్రి కూడా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా దాడులను ఉక్రెయిన్ నిలువరించిందన్నారు.
రష్యా దళాలు కీవ్ నగరాన్ని చుట్టుముట్టవచ్చు. కానీ ఉక్రెయిన్ ప్రజల హృదయాలను , ఆత్మలను పుతిన్ ఏనాటికి కూడా పొందలేడని బైడెన్ చెప్పారు. స్వేచ్ఛా ప్రపంచం సంకల్పాన్ని ఎప్పటికీ కూడా ఆయన బలహీనపర్చబోడని బైడెన్ తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులను దుర్మార్గమైనవిగా ఆయన పేర్కొన్నారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందన్నారు.అమెరికా గగనతలంలోకి రష్యా విమానాలపై నిషేధం విధిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు.ఉక్రెయిన్ ను రష్యా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ను రష్యా బలహీనపర్చలేదని బైడెన్ అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులను నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఈయూ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా రష్యా తీరును తప్పు బడుతున్నాయి. ఉక్రెయిన్ కు పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యా విమానాలతో పాటు బ్యాంకు లావాదేవీలపై కూడా ఆంక్షలు విధిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో మంగళవారం ఉదయం జరిగిన దాడుల్లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను అత్యవసరంగా రైళ్లలో లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా విడిచిపెట్టాలని భారతీయులకు ఎంబసీ కోరింది. ఇదే తరుణంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసినట్టు ప్రకటించింది. కీవ్‌లో ప్రస్తుతం భారతీయులెవరూ లేరనీ ఎంబసీని భారత దౌత్య సిబ్బందిని మరోచోటికి తరలించారని విదేశాంగశాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కై సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై రష్యా దాడులను ఖండిస్తున్నామని. దేశ చరిత్రలో మంగళవారం బ్లాక్‌డే అని అభిప్రాయ పడ్డారు. ఈయూ పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కై మాట్లాడారు.తమకు ఈయూ దేశాల మద్దతు ఉందన్నారు. రష్యా ఎన్ని దాడులు చేసినా తాము పోరాడుతున్నామని యుద్ధానికి భయపడబోమని జెలెన్ స్కీ ప్రకటించారు. కానీ, ఈ దాడిలో అమాయకులు, ప్రజలు మరణిస్తున్నారని జెలెన్‌స్కై ఆందోళన వ్యక్తం చేశారు.
