హైదరాబాద్: లండన్ లో బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యూకే, యూరప్, లండన్ లలో ఈ బతుకమ్మ, దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది.  

తెలంగాణ డవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని బార్కింగ్ వద్ద బార్కింగ్ అబ్బె స్కూల్ ఈ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.   

తెలంగాణ మహిళలు బతుకమ్మలను చేసి తీసుకొని వచ్చి ఆట పాటలతో హోరెత్తించారు. తెలంగాణ ఆడపడచులు చేసిన వివిధ నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ బతుకమ్మ , దసరా సంబరాలలో తెలంగాణ మహిళలు ఆట పాటలతో స్టేజ్ ను దుమ్ముధులిపారు.  


అనంతరం సూపర్ వంటకాలతో పసందైన విందు ఆరగించారు. ప్రవాస తెలంగాణ ప్రజలకి తెలంగాణ వంటకాలు చికెన్ బిర్యాని, మటన్ కర్రి,, వెజ్ ఫ్రైడ్ రైస్, భగారా భైంగన్, వడ , జిలేబిలతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ భోజన ఏర్పాట్లు చేయడం విశేషం.

తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మిని అందరికి పంచారు. ఉత్సవాల్లో పాల్గొన్న వారంతా జమ్మిని ఇచ్చి పుచ్చుకొని ఆలింగనం చేసుకున్నారు. 

తెలంగాణ డవల్పమెంట్ ఫోరం నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటడంతో సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులతో అక్షరజ్యోతి అనే బ్యానర్ కింద తెలంగాణ ప్రాంత పాఠశాలలకు వస్తు రూపంలో విరాళాలు అందజేయనున్నట్లు తెలిపారు.  

ఈ వేడుకల్లో అద్భుతంగా నృత్యం చేసిన చిన్నారులకు తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్, లండన్ సంస్థ అధ్యక్షులు బైరు శ్రవణ్ కుమార్ గౌడ్ మెమెంటోలు అందజేశారు. మెుత్తానికి లండన్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.