పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న మెహుల్ చోక్సీ.. ఇటీవల డొమినికాలో పోలీసులు చిక్కిన సంగతి తెలిసిందే. కాగా.. గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్ కి వచ్చి ఆయన పోలీసులకు చిక్కారంటూ వార్తలు వచ్చాయి.

చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా వ్యాఖ్యలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు. మెహుల్ తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడనే బార్బరా వాదనను కొట్టి పారేశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్‌ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు.  అదంతా బోగస్‌ అని, బార్బరా ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు.

డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని ఛీక్సీ ప్లాన్ వేశాడన్న ఆరోపణలను సైతం ప్రీతి ఖండించారు. చోక్సీ తనను తాను రాజ్ గా తనకు పరిచయం చేసుకున్నాడంటూ బార్బరా చెప్పిన మాటలను కూడా ప్రీతి ఖండించారు. కనీసం గూగుల్ లో చెక్ చేసుకొని ఉండాలి కదా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో స్నేహం చేసే ముందు సోషల్ మీడియాలో వెతుకుతున్నారని.. ఆమె అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని  ప్రశ్నించారు. అంతేకాదు వాట్సాప్ సందేశాల కంటెంట్‌ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్‌ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చి చెప్పారు.

 ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా  వెర్షన్‌ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ  ప్రశ్నించారు.