క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శాంతాక్లాజ్ అవతారం ఎత్తారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన.. చిన్న పిల్లల కోసం క్రిస్మస్ తాతయ్యలా మారిపోయారు. వాషింగ్టన్‌‌లోని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన చిన్నారులతో సరదాగా గడిపారు.

వారి కోసం బోలెడు బొమ్మలు, చాక్లెట్లు, తీసుకెళ్లి చిన్నారుల కళ్లలో ఆనందం నింపారు. అంతేకాదు పిల్లలకు కబుర్లు చెబుతూ.. వారికి తనతో పాటు తెచ్చిన కానుకలను అందించారు. ఎలాంటి ముందస్తు సమాచారం రాకుండా ఒబామా సర్‌ప్రైజ్ విజిట్ చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆశ్చర్యానికి గురైంది.

మాజీ అధ్యక్షుడు స్వయంగా భుజాన గిఫ్ట్ బ్యాగ్‌ వేసుకుని ఒబామా ఆస్పత్రికి రావడంతో.. వారు కంగారుపడ్డారు. ఆయనతో సెల్పీ దిగేందుకు పోటీపడ్డారు. మరోవైపు చిన్నారులతో ఒబామా గడిపిన దృశ్యాలను ‘‘చిల్డ్రన్స్ నేషన్’’ అనే సంస్థ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది.

ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. అగ్రరాజ్యానికి 44వ అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా... ఇప్పటికీ వాషింగ్టన్‌లోనే నివసిస్తున్నారు. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులతో గడిపారు.