చేతులు చెట్టు బెరడులా మారిపోతే... దేహం చెట్టులా రూపాంతరం చెందితే.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఇది నిజంగా జరిగితే... వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బజందర్ అనే యువకుడు అరుదైన సిండ్రోమ్ కారణంగా చేతులకు చెట్ల బెరడుల్లా మొలకలు వచ్చే వ్యాధితో బాధపడుతున్నాడు.

దీంతో వైద్యులను ఆశ్రయించిన అతనికి సుమారు 25 సర్జీలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో అతను చికిత్స తీసుకోవడం మానేశాడు. అయితే వ్యాధిత మరింత ముదరడంతో ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆస్పత్రిలో చేరాడు.

దీనిపై బజందర్ మాట్లాడుతూ... ఈ బాధ భరించడం తన వల్ల కావడం లేదని.. రాత్రుళ్లు సరిగా నిద్రపట్టడం లేదని.. డాక్టర్లకు తన రెండు చేతులు తొలగించమని చెప్పినప్పటికీ వారు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ ప్రతికల్లో అబుల్‌పై కథనాలు ప్రసారం కావడంతో విషయం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వరకు వెళ్లింది. దీంతో ఆమె ప్రభుత్వం తరపున అబుల్‌కు ఉచిత వైద్య సదుపాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మొదటి విడత చికిత్సలో భాగంగా అబుల్ దాదాపు రెండేళ్లు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. కాగా.. ఎపిడెర్మెడైప్లాసియా వెర్రుక్కిఫోర్మిస్ జన్యు సంబంధమైన వ్యాధిని ‘‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్‌’’గా పిలుస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు దాదాపు 12 మంది వరకు ఉన్నారని అంచనా. 2017లో బంగ్లాదేశ్‌కే చెందిన ఓ బాలిక కూడా ఇదే రకమైన వ్యాధితో చికిత్స తీసుకుంది. డాక్టర్లు ఆమె శస్త్రచికిత్స చేసి ఉపశమనం కలిగించినప్పటికీ.. ఆ వ్యాధి మరోసారి తిరగదోడింది.