బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... మరో 50 మంది గాయాల పాలయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా నగరంలోని పాత చౌక్ బజార్ లోని భవనంలో అగ్నికీలలు రేగాయి. 

భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పాత భవనం కావడంతో అగ్ని ప్రమాదంలో ఎక్కువ మంది మరణించారు. మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. తాము ఇప్పటివరకు 69 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని బంగ్లాదేశ్ అగ్నిమాపక శాఖ సంచాలకులు జుల్ఫికర్ రహమాన్ చెప్పారు. 

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఆయన వివరించారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తేలలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.