జీవిని బట్టి దాని ఆయుష్షు, గర్భస్థ సమయం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనుషుల్లో తొమ్మిదినెలలు సమయం పడుతుంది. కానీ ఓ చిన్నారి ఏకంగా 27యేళ్ల తరువాత పుట్టి రికార్డ్ సాధించింది. అదెలా సాధ్యం.. 27 యేళ్లపాటు పొట్టలో ఎలా ఉంది? ఆ తల్లి ఏలా మోసింది? ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయికదా...

వివరాల్లోకి వెడితే.. మోలీ గిబ్సన్‌ అనే చిన్నారి దాదాపు 27 ఏళ్ల తర్వాత భూమ్మీద పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో చిన్నారి మోలీ కళ్లు తెరిచింది. కానీ తన గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఇన్నేళ్ల పాటు ఆ పిండాన్ని గడ్డకట్టిన స్థితిలో భద్రపరిచారు. తాజాగా 2020 ఫిబ్రవరిలో ఓ జంట బిడ్డ కావాలని కోరడంతో ఆ పిండాన్ని అభివృద్ధి పరిచారు. 

టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం అంటే ప్రోజెన్ పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డు సృష్టించారు. ఈ అరుదైన పద్దతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. 

గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే ఎమ్మా కూడా ఇదే పద్దతిలో జన్మించింది. ఈ పద్దతిని ‘ఎంబ్రోయో డొనేషన్’‌ అంటారు. అంటే పిండాన్ని దత్తత తీసుకోవడం. మనకు వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా.. ఈ పద్ధతి అమెరికాలో ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. 

ఈ పద్దతిలో ఏళ్ల క్రితమే పిండాలను తయారు చేసి వాటిని గట్టకట్టిన స్థితిలో భద్రపరుస్తారు. పిల్లలు కావాలనుకున్న దంపతులకు ఈ పిండాలను దత్తత ఇస్తారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన స్థితిలోనే ఉంది. 

ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లలు కోసం కలలుగనే జంటల కోసం ఇప్పుడు ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ‘ఎంబ్రోయో డొనేషన్’‌ విధానం చాలా చాలా ప్రత్యేకం. అంతేగాక.. ఇదెంతో అరుదైనది కూడా. 

ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్‌ఈడీసీ) అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది.

ఈ క్రమంలో టీనా, గిబ్సన్‌ దంపతులు ‘ఎంబ్రోయో డోనేషన్’‌ విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, ఆ ఇద్దరు పిల్లలు 27 ఏళ్ల కిందటే పిండంగా మారారు. అలా గిబ్సన్ దంపతులు 2017లోనే.. 24 ఏళ్ల నాటి పిండాన్ని బిడ్డగా పొంది తొలి రికార్డు నెలకొల్పారు. 

తాజాగా రెండో బిడ్డను కూడా పొంది మొదటి రికార్డును బద్దలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తే.. వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేసారి పిండాలుగా మారారు. రెండో పిండం ఈ లోకాన్ని చూసేందుకు అదనంగా మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చింది.